These Things To Consider Before Quitting Job : కొందరికి ఉద్యోగం సాధించడం సవాల్. మరికొందరికి దాన్ని కొనసాగించడం సవాల్. పలు రకాల కారణాలతో మధ్యలోనే జాబ్ మానేయాలని చాలా మంది చూస్తుంటారు. అయితే.. కారణం ఏదైనా జాబ్ వదిలేయాలని నిర్ణయించుకునే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.
సంస్థలోనే మరో చోటుకి మారొచ్చు : మీరు చేసే కంపెనీలో తోటి ఉద్యోగులతో ఇబ్బందిగా అనిపించినప్పుడో.. లేదా బాస్ తిట్టాడని అనిపించినప్పుడో.. ఉద్యోగం మానేయాలని అనుకుంటే.. మీరు పనిచేసే కంపెనీలోనే వేరే చోటుకి మారే ఛాన్స్ ఉందేమో చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉందని అనుకుంటే.. HR, మేనేజర్ని సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం బెటర్ అంటున్నారు.
ఆర్థిక స్థితిగతులు : జాబ్ వదిలేస్తే ఒక సమస్య తీరిపోవచ్చు. కానీ.. కొత్త సమస్యలు కూడా వస్తాయి. మొదటి ఎఫెక్ట్ ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. చేతికొచ్చే డబ్బులు ఆగిపోతాయి. కాబట్టి ఉద్యోగం మానేసే ముందు మీ ఆర్థిక స్థితిని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. కొత్త జాబ్ దొరికడానికి ఎంత టైమ్ పడుతుందో అంచనా వేసుకోవాలి. అప్పటి వరకూ ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే జాబ్ వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills
మీపై ఆధారపడిన వారి గురించి ఆలోచించడం : సింగిల్ స్టేటస్‌లో ఉన్నవారైతే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ.. కుటుంబ యాజమాని అయితే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగానికి రిజైన్ చేస్తే.. కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. మీ బీమా ప్రీమియం, ఇతర లోన్స్ , బకాయి బిల్లులు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించిన తర్వాతనే ఉద్యోగం మానేసే నిర్ణయానికి రావాలంటున్నారు నిపుణులు.
కెరీర్ లక్ష్యాల గురించి ఆలోచించడం : మీరు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకునే ముందు కెరీర్ లక్ష్యాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాలనుకుంటున్నప్పుడు బయట మార్కెట్లో మీ జాబ్ ఫీల్డ్‌కు సంబంధించి ఎలాంటి డిమాండ్ ఉందో తెలుసుకోవాలి.
ఫ్యూచర్ ప్లాన్‌పై క్లారిటీ : మీరు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఆలోచించి ఉండవచ్చు. అయితే.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫర్వాలేదు గానీ.. అంచనాలు తలకిందులైతేనే చిక్కంతా. కాబట్టి, జాబ్ మానేయాలనే ఆలోచన తొందరపాటు నిర్ణయం కాకూడదని అంటున్నారు. అందుకే.. ప్లాన్ B కూడా ఉండాలని సూచిస్తున్నారు.
మానసికంగా సిద్ధంగా ఉండాలి : మీరు జాబ్ మానేసేముందు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మీరు ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనే నిర్ణయం మీ మానసిక ప్రశాంతతకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడం. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే.. ఇరుగు పొరుగు ఆరాలు, సొంత మనుషుల నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కోక తప్పకపోవచ్చు. వాటికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు.. అనవసరంగా రిజైన్ చేశానని తర్వాత బాధపడే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలా జరగకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ ఆలోచించి, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే జాబ్‌కు రిజైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.