Home Insurance Policy Benefits : మనం ఎంతో ఇష్టపడి మన కలల ఇంటిని నిర్మించుకుంటాం. మన జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంటి కోసమే ఖర్చు చేస్తాం. ఆ ఇంటిలో మనకు నచ్చిన విలువైన వస్తువులు, సామానులు సహా సమస్తం అమర్చకుంటాం. మరి ఇలాంటి ఇంటికి అనుకోని విధంగా ఏమైనా జరిగితే? లేదా భారీగా నష్టం వాటిల్లితే, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఏర్పడిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలి? ఇలాంటి సందేహం మీకు వచ్చిందా? అయితే ఇది మీ కోసమే.
మన ఇంటిని కాపాడుకునేందుకు పలు హౌస్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఇవి మన గృహానికి సంబంధించి ఎలాంటి నష్టవాటిల్లినా, పరిహారం అందిస్తాయి.
హౌస్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు?
గృహ బీమా పథకాలను ఇంటి యజమాని తీసుకోవచ్చు. లేదా అద్దెకు ఉన్న వాళ్లు కూడా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఇంటికే కాదు, అందులోని వస్తువులు, ఆభరణాలు, కళాకృతుల కోసం కూడా బీమా పాలసీ తీసుకోవచ్చు. దీని వల్ల దొంగతనం, అగ్ని ప్రమాదం సహా ఇతర రకాల ప్రమాదాలు జరిగినప్పుడు బీమా కంపెనీలు మీకు పరిహారం అందిస్తాయి.
ఏయే సందర్భాల్లో హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు?
ఇల్లు లేదా ఆస్తిని అద్దెకు ఇచ్చినప్పుడు యజమాని హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రమాదం వల్ల ఆస్తి ధ్వంసమైనప్పుడు, అద్దెకు ఉన్నవాళ్లు అర్థాంతరంగా ఇల్లు ఖాళీ చేసినప్పుడు, యజమానికి ఆదాయ నష్టం వాటిల్లుతుంది. కనుక ఇలాంటి వాటికి కూడా గృహ బీమా పాలసీలు తీసుకోవచ్చు. ఒక రోజు వ్యవధి నుంచి 5 సంవత్సరాల సుదీర్ఘకాలం వరకు ఈ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి.
ఏ పాలసీ ఎంచుకుంటే బెటర్?
- సమగ్ర బీమా పాలసీ : ఈ పాలసీ తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, నివాసితులు సహా అన్నింటికీ రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, దొంగతనం వంటి ఘటనలు జరిగినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది. అయితే, కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. అలాగే పాలసీ తీసుకునేటప్పటికే ఇంటికి జరిగిన ప్రమాదాలనూ ఈ పాలసీలో పరిగణనలోకి తీసుకోరు. అలాగే ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదు.
- హోం కంటెంట్ ఇన్సూరెన్స్ : ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఉదాహరణకు ఆభరణాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్ ధరను బట్టి బీమా మొత్తం చెల్లిస్తారు.
- స్ట్రక్చురల్ ఇన్సూరెన్స్ : ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు ఈ బీమాను క్లెయిం చేసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడుల వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే బీమా అందజేస్తారు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్, ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం అందుతుంది.
- టెనెంట్ ఇన్సూరెన్స్ : ఇంట్లో అద్దెకు ఉండేవారు ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. గృహోపకరణాలు, ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చివరకు దుస్తులకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
- ల్యాండ్‌లార్డ్స్ బీమా : ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు ఈ తరహా బీమా తీసుకునే వెసులుబాటు ఉంది. వివిధ కారణాల వల్ల అద్దె ఆదాయం కోల్పోయినట్లయితే, ఈ బీమా వర్తిస్తుంది. అలాగే అద్దెకు ఉండేవారి వల్ల ఇంటికి లేదా పరిసరాల్లో ఏదైనా ఆస్తికి నష్టం జరిగినా ఈ బీమాను క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ఏయే సందర్భాల్లో బీమా వర్తిస్తుందన్నది కంపెనీ నిబంధనలను అనుసరించి ఉంటుంది.
- అగ్నిప్రమాద బీమా : వాతావరణ మార్పులు, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా అగ్నిప్రమాదాలు జరగవచ్చు. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్నిప్రమాద బీమాలు ఉన్నాయి.
- దొంగతనాల నుంచి రక్షణ : ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్ విలువను బట్టి బీమా అందజేస్తారు.
పై వాటిలో ఏ బీమా పాలసీ తీసుకోవాలనుకున్నా, ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం మొదలైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను పోల్చి చూసుకొని ఏది సమగ్రంగా ఉంటే దాన్ని తీసుకోవాలి. అలాగే ఎక్కువ హామీ మొత్తం ఉన్న పాలసీని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి. మీ అవసరాలు, ఇల్లు ఉన్న ప్రాంతం, అక్కడి పరిసరాలు, అక్కడి వాతావరణాన్ని బట్టి అనువైన పాలసీని ఎంపిక చేసుకోవాలి. వీలైనంత వరకు సమగ్ర పాలసీ తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా ITR ఫైల్ చేయలేదా? గడువు ముంచుకొస్తోంది - త్వరపడండి! - ITR Filing 2024 Deadline