WEF President Comments On Indian Economy : భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా సాగుతోందని, త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్గే బ్రెండే పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న ఆశావహ దృక్పథం ప్రపంచంలో మరెక్కడా కనిపించడం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు మోదీ ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్ ఇండియా సదస్సు ద్వారా తిరిగి భారత్‌కు రావాలని అనుకుంటున్నట్లు బ్రెండే తెలిపారు.
ప్రతియేటా జనవరిలో దావోస్ కేంద్రంగా జరిగే డబ్ల్యూఈఎఫ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఎల్లప్పుడూ ఆహ్వానం ఉంటుందని బోర్గే బ్రెండే చెప్పారు. భారత్ కొన్నేళ్లపాటు 7 శాతం వార్షికవృద్ధిని నమోదు చేస్తుందని ఆయన అంచనా వేశారు. కొంతకాలంగా భారత్‌లో సంస్కరణలు కొనసాగుతున్నట్లు బ్రెండే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ పద్ధతిలో కంటే డిజిటల్ వాణిజ్యమే వేగంగా విస్తరిస్తోందని, డిజిటల్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ కొనియాడారు.
'వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగింది'
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం ఊపందుకున్నాయని బ్రెండే పేర్కొన్నారు. తయారీ కార్యకలాపాలూ పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. మరోవైపు వచ్చే కొన్నేళ్లలో అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగా భారత్ తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. చాలా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నుంచి భారత్ దూరంగా ఉండగలిగిందన్నారు. పొరుగు దేశాలతో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగిందని తెలిపారు.
ఐదేళ్ల పాటు ఆరు శాతం వృద్ధి : జెఫరీస్
భారత్ 2027 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ అంచనా వేసింది. తద్వారా జర్మనీ, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. 2030 నాటికి పది ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌ను విస్మరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడింది. జీఎస్టీ అమలు, దివాలా స్మృతి చట్టం, రెరా, నోట్ల రద్దు వంటి కీలక సంస్కరణల ప్రభావం ఉన్నప్పటికీ భారత జీడీపీ వృద్ధి పథంలో సాగిందని వివరించింది. వచ్చే ఐదేళ్ల పాటు భారత్ ఆరు శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని జెఫరీస్ తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వచ్చే ఐదు నుంచి ఏడేళ్ల పాటు 8-10 శాతం రాబడిని ఇస్తాయని అంచనా వేసింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు- జీవితకాల గరిష్ఠంతో ముగిసిన నిఫ్టీ
'దేశాన్ని విడిచి వెళ్లనీయొద్దు' బైజూస్ రవీంద్రన్‌పై ఈడీ లుక్ అవుట్ నోటీసులు