UPI Transaction Limit Bank Wise : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ముఖ్యంగా మనం ఎలాంటి బ్యాంక్ వివరాలు నమోదు చేయకుండానే, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం సహా వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా అందుకే యూపీఐ మారిపోయింది. దీంతో ఈ సేవలకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిమితులు పెంచుతూ, యూపీఐ లైట్ అంటూ అనేక మార్పుల్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అయితే రోజువారీ చేసే యూపీఐ చెల్లింపుల విషయంలో బ్యాంకుల వారీగా లిమిట్స్ ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.
ఎస్‌బీఐ : ఎస్‌బీఐ కస్టమర్లు రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, డీసీబీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ సైతం ఇదే పరిమితిని వర్తింపజేస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. 24 గంటల్లో గరిష్ఠంగా 20 ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ : ఐసీఐసీఐ బ్యాంక్ రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు లావాదేవీలకు అనుమతిస్తోంది. 24 గంటల్లో గరిష్ఠంగా 10 ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా : రోజువారీ ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ను బ్యాంక్ ఆప్ బరోడా రూ.లక్షగా నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు రోజుకు గరిష్ఠంగా 20 లావాదేవీలు జరపొచ్చు.
కెనరా బ్యాంక్ : యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్ రూ.లక్ష పరిమితి విధించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్ : డెబిట్ ఫండ్ చెల్లింపులు/వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్ రూ.లక్షగా యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ : కోటక్ మహీంద్రా బ్యాంక్ రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు బదిలీ చేయొచ్చని పేర్కొంది. రోజులో 10 లావాదేవీలు చేయవచ్చు. ఒక వేళ క్యూఆర్ కోడ్‌ను అప్‌లోడ్ చేసి డబ్బు చెల్లింపులు చేయాలంటే రూ.2,000 వరకు మాత్రమే అనుమతిస్తోంది.
పన్ను చెల్లింపుల పరిమితిని పెంచిన ఆర్‌బీఐ
యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ తాజాగా సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. ఫలితంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది. క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, పారిన్ ఇన్‌వార్డ్ రెమిటెన్స్‌లకు రూ.2 లక్షల వరకు చెల్లించొచ్చు. ఐపీఓ, రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లో రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు మాత్రం అన్ని బ్యాంకులూ రూ.1లక్ష వరకే అనుమతిస్తున్నాయి.
అప్పులు దొరకట్లేదా? బ్యాంకులు నో అంటున్నాయా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - Personal Loan Rejected