Home Loans On Unregistered Flats : డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని సార్లు అత్యవసరం అవుతుంది. ఇలాంటి వారు తెలిసిన వారి వద్ద అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కుదరకపోతే తమ పేరున ఉన్న ఆస్తులు బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దగ్గర తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అయితే.. రిజిస్ట్రేషన్ పూర్తయిన ల్యాండ్, ఫ్లాట్స్పైనే బ్యాంకులు రుణాలు ఇస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ.. పలు కారణాలతో కొంతమంది ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటాయి. మరి.. వీటికి బ్యాంకులు లోన్ అందిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.
రికార్డులలో నమోదు కావు!
గవర్నమెంట్ రికార్డుల్లో రిజిస్ట్రేషన్ కానీ ఆస్తులు లేదా ఫ్లాట్లను 'అన్ రిజిస్టర్డ్ ఆస్తులు' అని అంటారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, డాక్యుమెంట్స్ సక్రమంగా ఉండకపోవడం వంటి పలు కారణాలతో ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటాయి. అయితే.. అన్ రిజిస్టర్డ్ ఆస్తులకు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు రుణాలు అందించవు. ఎందుకంటే.. అన్ రిజిస్టర్డ్ ల్యాండ్స్ లేదా ఫ్లాట్‌లకు సంబంధించిన వివరాలు గవర్నమెంట్ రికార్డ్‌లలో ఉండవు కాబట్టి.. బ్యాంకులు అంత సులభంగా రుణాలను ఇవ్వవని నిపుణులు చెబుతున్నారు.
చట్టబద్ధంగా డాక్యుమెంట్లు కలిగిన ఆస్తులను మాత్రమే బ్యాంకులు తాకట్టు పెట్టుకొని హోమ్‌లోన్ అందిస్తాయి. రిజిస్టర్డ్ ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కు ఉంటుంది. లోన్ తీసుకున్న వారు బ్యాంకుకు రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్తిని జప్తు చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటుంది.
అన్ రిజిస్టర్డ్ ఆస్తులతో ఇబ్బందులు :
- అన్ రిజిస్టర్డ్ ఆస్తులకు రుణాలు అందించడం బ్యాంకులకు ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి, బ్యాంకులు రిస్క్ తీసుకుని లోన్ ఇవ్వడానికి అంగీకరించవు.
- ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదంటే.. ఏవో పెద్ద కారణాలే ఉంటాయి. నిర్మాణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమంగా నిర్మించడం వంటి సమస్యలు ఉంటాయి.
- అన్ రిజిస్టర్డ్ ఆస్తులకు సరైన భద్రత ఉండదు కాబట్టి.. బ్యాంకులు లేదా ఇతర సంస్థలు రుణాలను అందించడానికి ఆసక్తి చూపించవు.
- కాబట్టి.. మీ ఆస్తిని తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఒకవేళ మీరు ఏదైనా భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. తప్పకుండా రిజిస్టర్డ్ అయ్యిందా? లేదా? అన్నది పరిశీలించాలని సూచిస్తున్నారు. తక్కువ డబ్బుకు వస్తోందని ఆశపడి అన్ రిజిస్టర్డ్ ఆస్తులు కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వాళ్లు లోన్ ఇవ్వొచ్చు కానీ..
అన్ రిజిస్టర్డ్ ఫ్లాట్లకు బ్యాంకులు లోన్ ఇవ్వనప్పటికీ.. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ ఫైనాన్షియర్లు కూడా లోన్ అందించే అవకాశం ఉంటుంది. కానీ.. వీరు అధిక వడ్డీని వసూలు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇతరత్రా రిస్కులు కూడా ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కాబట్టి.. ఆస్తుల రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకటో తేదీ ఊరట- తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర- ఎంతంటే? - Gas Price Reduced