India's Economic Growth Forecast : భారత ఆర్థిక వృద్ధి రేటును దాదాపు 7శాతానికి పెంచింది ఐక్యరాజ్య సమితి (ఐరాస). గతంలో ఇచ్చిన అంచనాలను తాజాగా సవరించింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని పేర్కొంది.
ఏకంగా 7 శాతం పెంపు
2024లో భారత్ 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఐరాస తొలుత అంచనా వేసింది. బహిర్గత డిమాండ్ తక్కువగా ఉంటుందని, దీనివల్ల సరకుల ఎగమతిలో వృద్ధి దెబ్బతింటుందని పేర్కొంది. అదే సమయంలో ఔషధ, రసాయన ఎగుమతులు బలంగా పుంజుకుంటాయని తెలిపింది. జనవరిలో 2024 భారత వృద్ధి రేటును ఐరాస 6.2 శాతంగా పేర్కొంది. దాన్ని ఇప్పుడు ఏకంగా 0.7 శాతం పెంచింది. 2025 అంచనాలను మాత్రం సవరించలేదు.
ఐరాస అంచనాలు
భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2023 నాటి 5.6 శాతం నుంచి 2024లో 4.5 శాతానికి దిగొస్తుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. దక్షిణాసియా వ్యాప్తంగా ఇదే ధోరణి ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం గరిష్ఠంగా ఇరాన్లో 33.6 శాతం, మాల్దీవుల్లో అత్యల్పంగా 2.2 శాతంగా నమోదవుతుందని తెలిపింది. భారత్, బంగ్లాదేశ్‌ల్లో ఆహార పదార్థాల ధరలు కొంత తగ్గినప్పటికీ, ఇంకా అధిక స్థాయిల్లోనే ఉన్నాయని వెల్లడించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో 2.7 శాతం, 2025లో 2.8 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఐరాస అంచనా వేసింది. 2024 అంచనాలను 0.3 శాతం పెంచింది. అమెరికా సహా బ్రెజిల్, భారత్, రష్యా వంటి వర్ధమాన దేశాల్లో బలమైన వృద్ధే అంచనాలను పెంచడానికి దోహదం చేసిందని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణంతో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు తక్కువ వృద్ధిరేటుకు పరిమితం కానున్నాయని పేర్కొంది.
2024లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5శాతం- వరల్డ్ బ్యాంకు అంచనా
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ ఇటీవలే అంచనా వేసింది. అలాగే దక్షిణాసియా వృద్ధి రేటు 2024లో 6 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధితో దూసుకుపోతుండడం; పాకిస్థాన్, శ్రీలంకల ఆర్థిక వ్యవస్థలు రికవరీ అవుతుండడమే ఇందుకు కారణని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 'సౌత్ ఏసియా డెవలప్మెంట్ అప్డేట్'లో పేర్కొంది.
రూ.75,500కు చేరిన బంగారం - రూ.88వేలు దాటిన వెండి! - Gold Rate Today