Stock Market Today May 29, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, లోక్ సభ ఎన్నికల ఫలితాల ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 74,502 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 22,704 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్
- నష్టపోయిన షేర్స్ : ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్
కుదేలైన బ్యాంకింగ్, రియాల్టీ స్టాక్స్
బుధవారం ప్రధానంగా బ్యాంకింగ్, రియాల్టీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ నష్టపోయాయి. రియాల్టీ షేర్లలో లోధా, ప్రెస్టేజ్, గోద్రెజ్ ప్రోపర్టీస్ కూడా భారీగా నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
సియోల్, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. షాంఘై ఒక్కటే స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం రూ.65.57 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open May 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 21 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద స్థిరపడింది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 29, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.