Business Startup Tips: మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. నూతన సంవత్సరంలో కొత్తగా కెరీర్ ప్రారంభించాలని చాలా మంది అనుకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది వ్యాపారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. అది చిన్నదైనా, పెద్దదైనా బిజినెస్ బెస్ట్ అని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుండడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఊపందుకున్నాయి. అందువల్లే అనేక మంది వ్యాపారాలవైపు అడుగులు వేస్తున్నారు. మీరు కూడా కొత్త సంవత్సరంలో వ్యాపారంలోకి దిగాలనుకుంటున్నారా? అయితే మీరు తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి!
మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వ్యాపారం చేయాలా? ఇలాంటన్నింటినీ మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఎలాంటి వ్యాపారం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? దానిలో లోటుపాట్లు ఏంటి? అనేవి ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మీరు వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? మార్కెట్ పరిస్థితులు తదితర విషయాలను అంచనా వేసుకుని వ్యాపారంలోకి దిగాల్సి ఉంటుంది. అలాగే మీ స్కిల్స్, వ్యాపారం కోసం ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై కూడా మీకు ఓ అంచనా ఉండాలి.
మార్కెట్‌లో పోటీదారులు
వ్యాపారం పెట్టాలనుకునే వారు కచ్చితంగా మార్కెట్లో తమ పోటీదారుల గురించి తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార మెళుకువలు తెలుస్తాయి. అలాగే ఇతర పోటీదారుల కంటే భిన్నంగా ఆలోచించవచ్చు.
ఉదాహరణకు : మీరు రెస్టారెంట్ లేదా స్టోర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అప్పుడు మీరు మీ పోటీదారుల రెస్టారెంట్లో భోజనం చేయాలి. అలాగే వారి మాల్లో షాపింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్ల అభిరుచులు తెలుస్తాయి. దీంతో మీ వ్యాపారాన్ని వినియోగదారులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే కస్టమర్ల నుంచి సమాచారాన్ని పొందొచ్చు.
ఆర్థిక సంసిద్ధత
వ్యాపారం ముందుకు సాగాలంటే మనకు బలమైన ఆర్థిక మూలాలు ఉండాలి. లేదంటే కనీసం ఆర్థిక వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకునే సామర్థ్యమైనా ఉండి తీరాలి. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కొన్ని నెలల పాటు నిరాటంకంగా నిర్వహించడానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయనే దానిపై ముందే ఒక అంచనాకు రావాలి. వ్యాపారానికి ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందో లెక్కలు వేసుకోవాలి. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్, రుణాలు, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి ద్వారా డబ్బును పొందొచ్చు.
బిజినెస్ ప్లాన్
బిజినెస్ ప్లాన్ లేకుండా వ్యాపారాన్ని మొదలుపెట్టడమనేది కరెక్ట్ కాదు. దీనివల్ల మీ బిజినెస్ ఎటువైపు పోతుందనే దానిపై మీకే క్లారిటీ ఉండదు. అందుకే బిజినెస్ ప్లాన్ రూపొందించుకున్నాక వ్యాపారంలోకి అడుగు పెట్టాలి. బిజినెస్ ప్లాన్ అనేది వ్యాపారంలో ప్రతి అంశానికి సిద్ధం కావడానికి మీకు సహాయపడుతుంది. పెట్టుబడిదారులు, రుణదాతలకు అందించడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక అంచనాలు, బడ్జెట్, పెట్టుబడిదారులు, రుణాలు, ఖర్చులు వంటి సమగ్ర వివరణలు బిజినెస్ ప్లాన్లో ఉంటాయి.
వ్యాపారం చేసేందుకు పెట్టుబడి కావాలా? పూచీకత్తు లేకుండా బిజినెస్ లోన్ ఆప్షన్స్ ఇవే!