Latest Income Tax Fake News : 'భారతదేశంలో 75 ఏళ్లు దాటిన వయోవృద్ధులు ఇకపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది' అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా?
ఫేక్ న్యూస్
ఇటీవల ట్విట్టర్‌లో, వాట్సాప్‌లో కేంద్ర ప్రభుత్వం ఇన్‌కం ట్యాక్స్ రూల్స్‌లో మార్పులు చేసిందనే ఓ వార్త విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఇంతకీ ఈ మెసేజ్‌లో ఏముందంటే,
A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 28, 2024
✔️This message is #fake pic.twitter.com/VAqRPEid2E
" సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరికీ, ఇకపై ఆదాయ పన్ను చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చింది. కనుక ప్రభుత్వ పెన్షనర్లు, ఇతర పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వయోవృద్ధులు ఇకపై ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ గవర్నమెంట్ - ఇన్‌కం టాక్స్ రూల్స్‌లో పలుమార్పులు చేసింది. ముఖ్యంగా రూల్ 31, రూల్ 31ఏలను మార్చింది. కనుక ఇప్పటి వరకు ఫారమ్ 16, ఫారమ్ 240లు సమర్పిస్తున్న సీనియర్ సిటిజన్లు, ట్యాక్స్ మినహాయింపు కోసం ఇకపై 12.88ఏ అప్లికేషన్‌ను బ్యాంకులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది."
సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిన ఈ వార్త పూర్తిగా ఫేక్ (నకిలీ) అని ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది. కనుక సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి నకిలీ వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించింది.
ఇంతకీ సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు?
ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, 60 ఏళ్లు - 80 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు సీనియర్ సిటిజన్లు అవుతారు. ఇక 80 ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ సూపర్ సీనియర్ సిటిజన్లు అవుతారు. వాస్తవానికి వీళ్లంతా తమకు వచ్చే ఆదాయంపై కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. కానీ ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194పీ ప్రకారం, మిగతా వారితో పోల్చితే వీరికి కొన్ని పన్ను మినహాయింపులు ఉంటాయి.
వారికి మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు!
75 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
1. పింఛను రూపంలో తప్ప, మరేతర మార్గాల్లోనూ ఆదాయం లేని వయోవృద్ధులు ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదు.
2. ప్రభుత్వం నోటిఫై చేసిన నిర్దిష్ట బ్యాంకు ద్వారా పెన్షన్, వడ్డీ రూపంలో ఆదాయం పొందుతున్న సీనియర్ సిటిజన్లు కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన పనిలేదు. కానీ ఇందుకు కోసం వారు బ్యాంకుకు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఛాప్టర్ VI-A కింద వారికి టీడీఎస్ డిడక్షన్‌లు, 87ఏ కింద రిబేట్‌లు వర్తిస్తాయి.
నోట్ : నేడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తప్పుడు సమాచారం ప్రచారం అవుతోంది. అలాగే సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనుక ఇలాంటి వాటి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.