Reliance Quick Commerce Business : దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరిగి క్విక్ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం 'రిలయన్స్ రిటైల్' ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బీబీనౌ ఉన్నాయి. ఇవి వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. కానీ రిలయన్స్ ఈ డెలివరీ మోడల్‌ను అనుసరించదని తెలుస్తోంది.
ఆ హామీ మాత్రం లేదు!
రిలయన్స్ కంపెనీ కరోనా సంక్షోభం సమయంలో జియోమార్ట్ పేరిట నిత్యావసర సరకుల డెలివరీ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తరహాలో ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదు.
30 నిమిషాల్లోనే డెలివరీ!
వినియోగదారులు ఆర్డర్ చేసిన కేవలం 30 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపార నమూనాను రిలయన్స్ రిటైల్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సొంత స్టోర్లు, కిరాణా దుకాణాల నుంచి వస్తువులను సేకరించి కస్టమర్లకు అందించే యోచనలో రిలయన్స్ రిటైల్ ఉంది.
జియోమార్ట్ పార్ట్నర్షిప్లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలు రిలయన్స్ రిటైల్ హోల్‌సేల్ విభాగం నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. అందువల్ల ఇతర క్విక్ కామర్స్ సంస్థల తరహాలోనే, ప్రతి ఏరియాలో డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం రిలయన్స్‌కు ఉండదు.
ఫైండ్ (FYND), లోకస్ లాంటి టెక్ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఉపయోగించి, చాలా దగ్గరి దారిలో వెళ్లి, 30 నిమిషాల్లోనే డెలివరీ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. తొలుత నిత్యావసర సరకులతో సర్వీస్ ప్రారంభించే యోచనలో కంపెనీ ఉంది. ఆ తరువాత దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ను కూడా విస్తరించే అవకాశం ఉందని సమాచారం. రిలయన్స్ రిటైల్‌కు ఉన్న 19,000కు పైగా స్టోర్లు ఇందుకు దోహదం చేయనున్నాయి.
వచ్చే నెలలోనే!
జూన్ నెలలోనే రిలయన్స్ క్విక్ కామర్స్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. తొలుత దిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తరువాత క్రమంగా దేశవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉంది. 'జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్' (JioMart Express) పేరిట వీటిని అందించనున్నట్లు సమాచారం. జియోమార్ట్ యాప్‌లోనే ఇది కూడా ఒక భాగంగా ఉండనుంది. రిలయన్స్ 2023లోనే ముంబయిలో క్విక్ కామర్స్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కానీ, వివిధ కారణాల వల్ల దాన్ని నిలిపివేసింది రిలయన్స్ కంపెనీ.