RBI Monetary Policy 2024 : రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదోసారి. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
6.5 శాతం రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం స్థూలంగా తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. ఈ ఆర్థికసంవత్సరంలో రుతు పవనాలు సాధారణంగా ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత సేవా రంగ కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.
జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతం
ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నందున, ఈ ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుదల మందగించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతంగా అంచనా వేసింది. బ్యాంకు రుణాల విస్తరణ నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులు ఊపందుకుంటున్నాయని పేర్కొంది. బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రభుత్వం మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోందని ఆర్‌బీఐ ప్రకటించింది.
వ్యక్తిగత రుణ వితరణలో గణనీయ వృద్ధి
విదేశీ పెట్టుబడి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆగస్టు రెండు నాటికి భారత విదేశీ మారక నిల్వలు 675 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరినట్లు పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయని వెల్లడించింది. దీంతో బ్యాంకులు క్రెడిట్ డిమాండ్‌ను అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కుటుంబాల పొదుపులను ఆకర్షించడంపై బ్యాంకులు దృష్టి సారించాలని సూచించింది. వ్యక్తిగత రుణ వితరణలో గణనీయ వృద్ధిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఆర్థిక సంస్థలు నిబంధనలు పాటించడం లేదు!
ఆర్థిక సంస్థలు కొన్నిసార్లు టాపప్ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో నిబంధనలను పాటించడం లేదని గుర్తించామంది. దీన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అరికట్టాలని సూచించింది. గ్లోబల్ టెక్ ఔటేజ్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తుచేసింది. యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతర చెక్ క్లియరింగ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. 2022-23లో జీడీపీలో 2 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2023-24 నాటికి 0.7 శాతానికి తగ్గినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రేపో రేటు యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో ఈఎమ్ఐ చెల్లింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
మీ క్రెడిట్ స్కోర్ పెరగాలా? ఈ అపోహలు అస్సలు పెట్టుకోవద్దు! - Tips To Increase Credit Score
స్వల్పంగా తగ్గిన పసిిడి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today 2024 August 8th