RBI Introduces ULI : యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో కొత్త తరహా సేవలకు నాంది పలకనుంది. ఇకపై బ్యాంక్ లోన్స్ తీసుకోవడాన్ని మరింత సులభతరం చేయడం కోసం 'యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్' (ULI)ను జాతీయ స్థాయిలో త్వరలో లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది. ఆర్‌బీఐ గతేడాదే 'ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్' పేరిట పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో, త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించడానికి సిద్ధమైంది.
"డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏ విధమైన పాత్ర పోషిస్తోందో, బ్యాంకు రుణాల మంజూరు విషయంలో 'యూఎల్‌ఐ' కూడా అదే తరహా పాత్ర పోషించనుంది. భారతదేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక నిర్వహించబోతోంది" అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.
'JAM, UPI, ULI, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు క్రమంగా విడుదల అవుతున్నాయి. ఇది భారతదేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక దశ. దీని వివిధ శాఖల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఫలితంగా ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే, క్షణాల్లో రుణాలు మంజూరు చేయడానికి వీలు అవుతుంది' అని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
యూఎల్‌ఐ ఎలా పనిచేస్తుంది?
భూ రికార్డులు మొదలుకొని, ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్‌ల ఆధారంగా యూఎల్‌ఐ పనిచేస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దీనివల్ల రుణ ఆమోద ప్రక్రియ మరింత సరళతరం కానుందని పేర్కొన్నారు. ఇకపై రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంతదాస్ వివరించారు. దీని వల్ల ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రజలకు, తక్కువ మొత్తంలో రుణాల కోసం ప్రయత్నించేవారికి దీని వల్ల వేగంగా లోన్స్ లభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఆర్‌బీఐ గతేడాది ఆగస్టు 17న ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేసింది. ఆర్‌బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా దీన్ని చేపట్టారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడం వల్లనే ఇప్పుడు యూఎల్ఐను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.