RBI Dividend Payout To Govt : కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చెల్లించిన డివిడెండ్‌తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది.
ఆర్‌బీఐ ప్రకటన
గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో డివిడెండ్ చెల్లింపు నిర్ణయాన్ని తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి బోర్డు ఆమోదించిందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు ఇదే రికార్డు
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌బీఐ కేంద్రానికి రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. 2018-19లో రూ.1.76 లక్షల కోట్లు డివిడెండ్‌ను చెల్లించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ భారీ మొత్తంలో రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించడం వల్ల గత రికార్డు బద్దలైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు, రాబడి మధ్య అంతరాన్ని రూ.17.34 లక్షల కోట్లకు (దేశ జీడీపీలో 5.1 శాతం) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని రూ.1.02 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌కు ఆమోదం తెలపడం గమనార్హం.
ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ల సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్ల సమావేశం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముంబయిలో బుధవారం జరిగింది. 2023 ఏప్రిల్ - 2024 మార్చి వరకు రిజర్వ్ బ్యాంక్ పనితీరును ఈ సమావేశంలో చర్చించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, ఆర్థిక నివేదికను బోర్డు ఆమోదించింది. కంటిన్జెన్సీ రిస్క్ బఫర్ లెవల్‌ను 6 నుంచి 6.5కు పెంచింది.