Procedure After Car Loan Closure : కారు లోన్ తీర్చిన తర్వాత చాలా మంది దాని గురించి మర్చిపోతారు. అప్పు తీర్చేశాం కదా అనే భావనలో ఉండిపోతారు. కానీ ఇది సరైన విధానం కాదు. కారు రుణం తీర్చిన తరువాత కూడా మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. అప్పుడే మీరు మీ కారుపై పూర్తి యాజమాన్య హక్కులు పొందుతారు.
- రుణ వివరాలు : కారు రుణాన్ని తీర్చేసిన తర్వాత లోన్ స్టేట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. రుణ వ్యవధిలో మీరు చేసిన చెల్లింపులు, ఇతర రుసుములు అన్నీ ఇందులో కనిపిస్తాయి. బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే వీటిని అందిస్తాయి. కొన్నిసార్లు బ్యాంకు శాఖకు వెళ్లి దీన్ని తీసుకోవాల్సి వస్తుంది.
- లోన్ క్లోజర్ సర్టిఫికెట్ : మీరు కారు లోన్ తీర్చేసిన తరువాత, మీ బాకీ మొత్తం తీరిపోయినట్లుగా బ్యాంకు ధ్రువీకరణ పత్రం (లోన్ క్లోజర్ సర్టిఫికెట్) ఇస్తుంది. దీనిని మీరు కచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
- హైపొథికేషన్ : మీరు లోన్ తీసుకొని కారు కొన్నప్పుడు, సంబంధిత రుణం ఇచ్చిన బ్యాంకు పేరు మీద 'రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్' (ఆర్‌సీ) ఉంటుంది. దీన్నే హైపొథికేషన్ అంటారు. అంటే, చట్టపరంగా మీ కారుకు యజమాని ఆ బ్యాంకు అన్నమాట. కనుక మీరు రుణం తీర్చేసిన తరువాత ఆర్‌సీ మీ పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుణదాత నుంచి లోన్ క్లోజర్ సర్టిఫికెట్, ఫారం-35 సహా ఇతర పత్రాలు తీసుకోవాలి. వీటన్నింటినీ ఆర్‌సీతో జత చేసి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఏ)లో సమర్పించాలి. సంబంధిత పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత హైపొథికేషన్ లేకుండా కొత్త ఆర్‌సీ మీ పేరున జారీ అవుతుంది.
- బీమా సంస్థకు సమాచారం : మీరు కారు రుణాన్ని తీర్చేసిన విషయాన్ని వాహన బీమా సంస్థకు కూడా తప్పనిసరిగా చెప్పాలి. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్లెయిం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది.
- క్రెడిట్ నివేదిక : కారు రుణం తీరిందన్న సంగతిని ధ్రువీకరించుకునేందుకు క్రెడిట్ రిపోర్ట్‌ను కూడా పరిశీలించాలి. అందులో కచ్చితంగా 'క్లోజ్డ్' అని ఉండాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
కార్ లోన్ గడువుకు ముందే తీర్చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Car Loan Prepayment