Paytm Shares Tank Another 20 PC : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో దాని మాతృసంస్థ వన్97 కమ్యునికేషన్స్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. గురువారం దాదాపు 20 శాతం వరకు నష్టపోయిన ఈ కంపెనీ షేర్లు, శుక్రవారం మరో 20 శాతం వరకు పతనమయ్యాయి. దీనితో వన్97 కమ్యునికేషన్ షేర్లు అత్యంత లోవర్ సర్క్యూట్‌కు పడిపోయాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. దీనితో పేటీఎం వాలెట్లు, ఫాస్టాగ్‌లు ఫిబ్రవరి 29 తరువాత ఉపయోగించడానికి వీలులేకుండా పోతుంది. అందుకే మదుపరులు ఈ కంపనీ మాతృసంస్థ అయిన వన్97 కమ్యునికేషన్స్ షేర్లను భారీ ఎత్తున అమ్మేస్తున్నారు.
శుక్రవారం వన్97 కమ్యునికేషన్ షేర్స్ 20 శాతం వరకు నష్టపోయాయి. దీనితో బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ వాల్యూ రూ.487.05లకు పడిపోయింది. ఎన్ఎస్ఈలో కూడా ఈ కంపెనీ స్టాక్ వాల్యూ రూ.487.20కు దిగివచ్చింది. దీనితో ఈ రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,378.41 కోట్లు తగ్గి, రూ.30,931.59 కోట్లకు పడిపోయింది. అంతేకాదు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ వార్షిక ఆదాయం కూడా దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు తగ్గవచ్చని అంచనా.
ఫిబ్రవరి 29 తరువాత సేవలు కొనసాగుతాయి : పేటీఎం సీఈఓ
ఫిబ్రవరి 29 తరువాత కూడా తమ యాప్ సర్వీసులు కొనసాగుతాయని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పష్టం చేశారు. పేటీఎం యాప్ సేవలను తమ కస్టమర్లు ఎప్పటిలానే వాడుకోవచ్చని ఆయన కంపెనీ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఆర్బీఐ ఆంక్షలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అయితే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ సర్వీసులు సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. కనుక ఆర్బీఐ ఆర్డర్స్ వీటిపై ప్రభావం చూపవు. కనుక పేటీఎం అందిస్తున్న స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ సర్వీసులపై నేరుగా ప్రభావంపడదు. కానీ ఇది మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే పేటీఎం షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తున్నారా? ట్రావెల్ ఇన్సూరెన్స్ మస్ట్ - బెనిఫిట్స్ ఏమిటంటే?
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!