Loan Against Life Insurance Policy : ప్రస్తుత కాలంలో చాలా మంది జీవిత బీమా పాలసీలు తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయమే. ఎందుకంటే, దీని వల్ల మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. అంతేకాదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో, మీ జీవిత బీమా పాలసీని కుదువ పెట్టి లోన్ కూడా పొందవచ్చు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ ఆర్టికల్‌లో జీవిత బీమా పాలసీదారులు తమ పాలసీపై లోన్లు ఎలా తీసుకోవాలి? రుణార్హతలు ఏమిటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే, జీవిత బీమా పాలసీపై తీసుకునే లోన్లు తక్కువ వడ్డీ రేటుకే లభిస్తాయి. అంతేకాదు, ఈ లోన్లను ఇతర రకాల రుణాలతో పోలిస్తే చాలా సులువుగా, వేగంగా పొందవచ్చు. ఎలా అంటే? బీమా సంస్థ వద్ద ఇప్పటికే మీ సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్లకు ఎక్కువ కాలం పట్టదు.
ఆ పాలసీలకు మాత్రమే!
అన్ని జీవిత బీమా పాలసీలపై లోన్స్ రావు. కేవలం మనీ బ్యాక్, ఎండోమెంట్ జీవిత బీమా పాలసీలపై మాత్రమే రుణాలు పొందవచ్చు. ఇందుకోసం మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను హామీగా పెట్టాల్సి ఉంటుంది. అయితే యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌పై, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాలు ఇవ్వరు.
బీమా పాలసీపై లోన్ పొందడం ఎలా?
స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి బీమా పాలసీపై లోన్స్ తీసుకోవచ్చు. సాధారణంగా సరెండర్ విలువ కలిగి ఉన్న ఎండోమెంట్ పాలసీలపై మాత్రమే రుణాలు అందిస్తారు. మీ పాలసీ ప్రీమియంను బట్టి మీ లోన్ విలువ ఉంటుంది. పాలసీ సరెండర్ విలువలో 60-80 శాతం వరకు లోన్ పొందొచ్చు. అయితే వివిధ బీమా కంపెనీల నియమ, నిబంధనల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ మారుతూ ఉంటుంది.
బీమా పాలసీపై లోన్ పొందాలని అనుకునేవాళ్లు, ముందుగా బీమా సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ ప్రతినిధులు మీ బీమా అర్హతను, వడ్డీ రేటును, రీపేమెంట్ నిబంధనలను, ఇతర వివరాలను మీకు తెలియజేస్తారు. అంతేకాకుండా మీ సందేహాలను సైతం నివృత్తి చేస్తారు. అయితే మీరు రుణ దరఖాస్తు కోసం, మీ గుర్తింపు పత్రాలు, అడ్రస్ ప్రూఫ్, ఒర్జినల్ బీమా పాలసీ డాక్యుమెంట్ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. తరువాత ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు బీమా సంస్థ మీ దరఖాస్తును, పాలసీ వివరాలను పరిశీలించి, లోన్ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తుంది. ఒక వేళ లోన్ అప్రూవల్ అయితే మీ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తుంది. లేదా చెక్‌ను పాలసీదారుడికి అందిస్తుంది. అయితే మీరు బీమా పాలసీపై రుణం తీసుకునే ముందు నియమ, నిబంధనలు అన్నింటినీ కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక వేళ మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే, పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. లేదా మీకు రావాల్సిన డెత్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి.
బీమా పాలసీపై లోన్ వల్ల కలిగే లాభాలు
జీవిత బీమా పాలసీపై తక్కువ వడ్డీ రేటుతో, చాలా సులువుగా రుణం పొందొచ్చు. డాక్యుమెంటేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలసీదారుల వివరాలు ఇప్పటికే బీమా కంపెనీల వద్ద ఉంటాయి. సాధారణ రుణాలతో పోలిస్తే, బీమా పాలసీపై లోన్ తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ అవసరం ఉండదు. ఇతర రకాల లోన్స్‌తో పోలిస్తే ఇది వేగంగా మంజూరు అవుతుంది. అంతే కాదు, మీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ అలానే కనసాగుతుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏమైనా పొరపాట్లు చేశారా? వెంటనే సరిదిద్దుకోండిలా! - How To Correct ITR Mistakes