National Women's Savings Day : భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన 'మహిళా పొదుపు దినోత్సవాన్ని' జరుపుకుంటారు. గృహిణిలు, ఉద్యోగం చేసే మహిళలు, కూలీ పనులు చేసే స్త్రీలు, ఇలా ప్రతిఒక్కరూ భవిష్యత్ కోసం కచ్చితంగా పొదుపు చేసుకోవాలి అని చెప్పడమే దీని లక్ష్యం.
డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ పురుషులే చూసుకోవాలనే రోజులు పోయాయి. నేటి మహిళలు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఏలుతున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరోవైపు గృహిణిలు ఉన్నారు. వీరు ఎవరికీ తీసిపోరు. వాస్తవం చెప్పాలంటే ఇంటికి ఆర్థిక మంత్రి ఇల్లాలే. అమె చేసే పొదుపే ఆ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. భవిష్యత్ ఆర్థిక పురోభివృద్ధికి మూలం అవుతుంది. అందుకే ప్రతి ఒక్క మహిళా తాము సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని కచ్చితంగా పొదుపు, మదుపు చేయాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో మహిళలకు ఉపయోగపడే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
1. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్
Mahila Samman Saving Certificate Details :
- పెట్టుబడి వ్యవధి : 2 సంవత్సరాలు
- పెట్టుబడి పరిధి : కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- వడ్డీ రేటు : కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ జమ అవుతుంది.
- ఉపసంహరణ (విత్డ్రావెల్) : స్కీమ్‌లో చేరిన ఒక సంవత్సరం తరువాత, ఖాతాదారుడు తను ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- మెచ్యూరటీ : ఉదాహరణకు 2023 అక్టోబర్‌లో ఖాతా తెరిస్తే, 2025 అక్టోబర్‌లో మెచ్యూర్ అవుతుంది.
- అర్హతలు : వయస్సుతో సంబంధం లేకుండా.. మహిళలు అందరూ ఈ పొదుపు పథకంలో చేరవచ్చు.
అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?
మహిళలు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టు ఆఫీస్‌కు వెళ్లి, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కోసం దరఖాస్తును సమర్పించాలి. అలాగే ఆధార్, పాన్ లాంటి కేవైసీ పత్రాలను సబ్మిట్ చేయాలి. తరువాత మీకు వీలైనంత మొత్తాన్ని నగదు లేదా చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి.
2. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్
Sukanya Samriddhi Yojana Scheme Details :
- అర్హతలు : 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరు మీద ఖాతా తెరవవచ్చు.
- వడ్డీ రేటు : డిపాజిట్ చేసిన మొత్తంపై 8% వడ్డీ ఇస్తారు.
- పెట్టుబడి పరిధి : సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
- పెట్టుబడి కాలం : ఆడపిల్లకు 15 ఏళ్లు వచ్చే వరకు మదుపు చేయవచ్చు.
- ఉపసంహరణ : అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు దాటిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం వరకు అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు దాటిన తరువాత స్కీమ్‌లోని అమౌంట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
- పన్ను ప్రయోజనాలు : ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఖాతా తెరవడం ఎలా?
ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో 10 సంవత్సరాలలోపు వయస్సున్న బాలిక పేరు మీదుగా తల్లిదండ్రులు 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతాను తెరవచ్చు.
ముఖ్యమైన బేధాలు!
Mahila Samman Saving Certificate Vs Sukanya Samriddhi Yojana :
1. పాలసీ వ్యవధి :
- మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MMSC) స్కీమ్ అనేది ఒక షార్ట్ టెర్మ్ స్కీమ్.
- సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఒక లాంగ్ టెర్మ్ స్కీమ్.
2. అర్హతలు :
- MSSC స్కీమ్ ప్రధానంగా వయోజనులైన మహిళ కోసం ఉద్దేశించినది.
- SSY స్కీమ్ అనేది ప్రత్యేకంగా 10 ఏళ్లలోపు బాలికల కోసం రూపొందించిన పథకం.
3. పెట్టుబడి లక్ష్యం :
- మహిళల స్వావలంబన, ఆర్థిక సాధికారత కోసం MSSC స్కీమ్ ఉపయోగపడుతుంది.
- బాలికల విద్య, వివాహం మొదలైన అవసరాల కోసం SSY పథకం అక్కరకు వస్తుంది.
- మీకు గనుక అవకాశం ఉంటే.. ఈ రెండు ప్రభుత్వ పథకాలను కచ్చితంగా ఉపయోగించుకోవడం మంచిది.
3. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ : ఇండియాలో పొదుపు ఖాతా తెరిచిన మహిళలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీకే రుణాలు, రాయితీలు అందిస్తున్నాయి. తమ పిల్లల పేరు మీద ప్రత్యేకంగా జూనియర్ అకౌంట్ తెరిచే అవకాశం ఇస్తున్నాయి. పైగా పొదుపు ఖాతాకు అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిప్ చేస్తున్న వారికి కొన్ని బ్యాంకులు 'మంత్లీ మినిమం బ్యాలెన్స్' నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి.
***
ఇన్సూరెన్స్ మస్ట్
మహిళలు పొదుపు చేయడమే కాదు, బీమా కూడా చేసుకోవాలి. అప్పుడే మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రత చేకూరుతుంది. నేడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు పురుషులతో పోలిస్తే, మహిళలకు చాలా తక్కువ ప్రీమియానికే బీమా పాలసీలను అందిస్తున్నాయి. అందువల్ల మహిళలు ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడం మంచిది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి.
***
మహిళా వ్యాపారవేత్తల కోసం
నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సొంతంగా వ్యాపార, వాణిజ్యాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి చేయూతనిచ్చేందుకే నేడు చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. పైగా అనేక రాయితీలు కూడా కల్పిస్తున్నాయి. ముఖ్యంగా గృహ రుణాల్లో ఎక్కువ ప్రయోజనం కల్పిస్తున్నాయి. కనుక ఉమ్మడిగా తీసుకునే రుణాల్లో ప్రధాన దరఖాస్తుదారుగా మహిళ ఉండడం మంచిది. దీని వల్ల వడ్డీ రేటు బాగా తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు వెహికల్ లోన్స్ విషయంలోనూ మహిళలకు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులోనూ మినహాయింపులు ఇస్తున్నాయి.
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే స్త్రీలకు భారతీయ మహిళా బ్యాంక్ బిజినెస్ లోన్స్ అందిస్తోంది. పూర్తిగా మహిళల నేతృత్వంలో నడిచే తయారీ కంపెనీలకు 10.15 శాతం వడ్డీ రేటుతో రూ.20 కోట్ల వరకు రుణాన్ని కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకైతే రూ.1 కోటి వరకు ఎలాంటి తనఖా లేకుండానే రుణాన్ని అందిస్తోంది.
***
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్
భారతీయ మహిళలు బంగారానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే బంగారం స్పష్టమైన విలువ గల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత చేకూరుతుంది. పైగా ఆర్థిక నష్టాలు వచ్చినప్పుడు, మీ బంగారం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి (లిక్విడిటీ) వీలవుతుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
భౌతిక బంగారం Vs డిజిటల్ బంగారం
చాలా మంది కాయిన్స్ లేదా కడ్డీలు లాంటి భౌతిక బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇలాంటి భౌతిక బంగారం ఇంట్లో ఉన్నప్పుడు, అవసరమైన సందర్బాల్లో అది మనకు అక్కరకు వస్తుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చేసుకోవడానికి వీలవుతుంది. లేదా బ్యాంక్‌లో కుదువపెట్టి, తక్కువ వడ్డీకే సులభంగా రుణం తీసుకోవడానికి వీలవుతుంది. పైగా కాలం గడిచిన కొలదీ మీ బంగారం విలువ పెరుగుతుంది. అయితే ఆధునిక కాలంలో భౌతిక బంగారంతోపాటు డిజిటల్ బంగారంపైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతోంది. దీని వల్ల దొంగలభయం ఉండదు. భౌతికంగా వాటికి కాపాలా ఉండాల్సిన అవసరం ఉండదు. పైగా మార్కెట్‌కు అనుగుణంగా దానిపై వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది.
1. సావరిన్ గోల్డ్ బాండ్లు
Sovereign Gold Bonds : ప్రభుత్వం జారీచేసిన ఈ బాండ్లు బంగారం అంతర్లీన విలువను కలిగి ఉంటాయి. పైగా వీటిపై ప్రభుత్వ హామీతో రాబడి కూడా వస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కనుక ఎలాంటి రిస్క్ ఉండదు. 8 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో కనిష్ఠంగా 1గ్రాము నుంచి 20కేజీల వరకు వాటి నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.5% ఫిక్సడ్ రేటుతో వడ్డీని పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల సర్టిఫికెట్‌ను భౌతిక బంగారంగానూ మార్చుకోవచ్చు.
2. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
Gold Exchange Traded Funds : ఇవి బంగారం ధరను ట్రాక్ చేసే మ్యూచువల్ ఫండ్స్. దీనిలో అధిక లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. కనుక మీకు నచ్చినప్పుడు వీటిని అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు జరపవచ్చు. దాచుకోవడం, భద్రతా సమస్యలు లాంటివి ఉండవు. అయినప్పటికీ సావరిన్ గోల్డ్ బాండ్ల వలె రాబడికి గ్యారంటీ ఉండదు. బంగారం ధరలో మార్పులను ఆధారంగా చేసుకొని వీటి విలువలో మార్పులు జరుగుతాయి. అంటే రిస్క్, రివార్డ్ రెండూ అధికంగానే ఉంటాయి.
3. డిజిటల్ గోల్డ్
Digital Gold : ఆన్లైన్లో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీనినే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సిప్ విధానంలో రూ.500 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా పెట్టి డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. EMI పద్ధతిలో చాలా చిన్న పరిణామాలలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ పద్ధతిలో సులభంగా ఫిజికల్ గోల్డ్‌ను లిక్విడేట్ చేయడానికి వీలుంటుంది. బంగారం కొనాలనుకునే మహిళలు సురక్షితమైన ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే డిజిటల్ బంగారం భద్రత అనేది, మనం ఎంచుకునే ప్లాట్‌ఫామ్ విశ్వనీయత మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు నిల్వ ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. అయితే ఈ ఛార్జీలు చాలా నామమాత్రంగా ఉంటాయి. అలాగే ఈ డిజిటల్ గోల్డ్‌పై సంపాదించే రాబడికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
***
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్
ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తమ కష్టార్జితమైన సొమ్మును నష్టపోకుండా, మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తారు. ఇలాంటి వారి కోసం మన దేశంలో అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి వీలు కల్పిస్తాయి. అయితే వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో మన దేశంలో అందుబాటులో ఉన్న 20 ప్రధానమైన పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) : జీవిత బీమాతోపాటు, ఆర్థిక వృద్ధిని కోరుకునే వారికి ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. దీనిలో కనిష్ఠంగా రూ.1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. యులిప్స్‌లో చేసిన పెట్టుబడులపై 10% నుంచి 24% వరకు రాబడులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో కాస్త రిస్క్ కూడా ఉంటుందనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తించుకోవాలి. యూలిప్స్ వచ్చే రాబడిపై ఇన్‌కం టాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్ : తక్కువ రిస్క్‌తో, స్థిరమైన రాబడి రావాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్‌లో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై 5% నుంచి 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
- పెన్షన్ ప్లాన్స్ : ఏమాత్రం నష్టభయం లేకుండా, దీర్ఘకాలంలో మంచి ఆదాయం సంపాదించాలని ఆశించేవారు ఈ పెన్షన్ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. పెన్షన్స్ ప్లాన్స్‌లో సాధారణంగా రూ.1000 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. చరిత్ర చూసుకుంటే పెన్షన్ ప్లాన్స్‌పై సుమారుగా 12%-22% వరకు రాబడి వస్తోంది. ఐటీ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పెన్షన్ ప్లాన్స్‌పై పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- చైల్డ్ ప్లాన్స్ : తమ బిడ్డల భవిష్యత్ కోసం మదుపు చేయాలని ఆశించే తల్లిదండ్రులు చైల్డ్ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్స్‌లో రిస్క్ కూడా కాస్త ఉంటుంది. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా ఈ చైల్డ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై సుమారుగా 14% - 22% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం కింద, ఈ బాలల పథకాలపై పన్ను మినహాయింపులు పొందవచ్చు.
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : ఉద్యోగ విరమణ చేసినవాళ్లు, 60 ఏళ్లు పైబడిన వారు ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో మదుపు చేయవచ్చు. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. తరువాత మరో 3 ఏళ్ల వరకు ఈ ప్లాన్‌ను పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు (కండిషన్స్ అప్లై) మదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్స్‌పై గరిష్ఠంగా 8.2% వరకు రాబడి వస్తోంది. పైగా ఆదాయ పన్ను చట్టం -1961, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) : 18-70 ఏళ్ల వయస్సు ఉన్న భారతీయ పౌరులందరూ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మార్కెట్ లింక్డ్ స్కీమ్ కనుక దీనిలో కాస్త రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాల పెట్టుబడులపై పెద్దగా రిస్క్ ఉండదు. చరిత్రను పరిశీలిస్తే, దీర్ఘకాలంలో ఈ ఎన్పీఎస్ స్కీమ్స్‌పై 9% - 15% వరకు రాబడి వస్తుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో టైర్-1, టైర్-2 ఆప్షన్లు ఉంటాయి. టైర్ 1 : కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేయవచ్చు. టైర్ 2 : కనిష్ఠంగా రూ.250 మదుపు చేయవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిపెట్టిన వారికి ఐటీ యాక్ట్-1961లోని సెక్షన్ 80 సీసీడీ(1), సెక్షన్ 80 సీసీడీ (2), సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ (POMIS) : భారతీయ పౌరులు అందరూ ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేయవచ్చు. దీనిలో రిస్క్ ఏమీ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో వ్యక్తిగతంగా రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్‌గా అయితే రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 7.4% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : భారతీయ పౌరులు అందరూ ఈ దీర్ఘకాలిక పెట్టుబడి పథకంలో చేరవచ్చు. దీనిలో 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తరువాత కూడా ప్రతీ 5 ఏళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు. ఈ పీపీఎఫ్ పథకంలో పెట్టిన డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో ఒక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పీపీఎఫ్ పెట్టుబడులపై 7.1% వరకు గ్యారెంటీ రాబడి వస్తుంది. ఐటీ యాక్స్-1961లోని సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్ : ఈ పథకంలో కనీసం 6 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీలు ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడుల్లో ఎలాంటి రిస్క్ ఉండదు. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బాండ్స్‌పై 8% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ పథకం కింద వచ్చిన రాబడిపై ఐటీ చట్టం 1961 ప్రకారం, పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ ఐటీ యాక్ట్-1957 ప్రకారం, దీనికి సంపద పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
- బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ : ఎలాంటి రిస్క్ లేకుండా, గ్యారెంటీగా ఆదాయం సంపాదించాలని ఆశించేవారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ అవుతాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్లు వరకు దీనిలో పొదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 4% నుంచి 9% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రాబడులపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) : డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాళ్లు అందరూ ఐపీఓలో పాల్గొనవచ్చు. కానీ దీనిలో రిస్క్- రివార్డ్ రెండూ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఐపీఓలో సంపాదించిన లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (STCG), లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (LTCG) చెల్లించాల్సి ఉంటుంది.
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ : షేర్ మార్కెట్ పెట్టుబడులు హెవీ రిస్క్‌తో కూడుకున్నవి. అయితే లాభాలు కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మీకు నచ్చినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- మ్యూచువల్ ఫండ్స్ : కాస్త రిస్క్ తీసుకుని మంచి రాబడులు సంపాదించాలని ఆశించేవారికి మ్యుచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. చాలా మంది సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్దిష్ట సమయం వరకు లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో 8% నుంచి 20% వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌పై సంపాదించిన లాభాలపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌తో ముడిపడిన మ్యూచువల్ ఫండ్లకు ఆదాయపన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- బంగారంపై పెట్టుబడులు : భారతదేశంలో చాలా మంది బంగారం కొనేందుకు ఇష్టపడతారు. కష్ట సమయంలో బంగారం మనల్ని ఆదుకుంటుందని నమ్ముతారు. బంగారంపై దీర్ఘకాలంలో 8% - 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ద్వారా వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- రియల్ ఎస్టేట్ : భారతదేశంలో నేడు స్థిరాస్తి రంగం మంచి భూమ్లో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనుక రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లీగల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అయితే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అని పెద్దలు చెబుతుంటారు. కనుక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాబడులపై గవర్నమెంట్‌కు కచ్చితంగా (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) : ఈ స్థిరాస్తి రంగ పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ REITsలో కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 10% - 15% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రాబడులపై కచ్చితంగా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి.
- క్రిప్టోకరెన్సీ : ప్రపంచంలో ఎవరైనా ఈ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన అవగాహన లేకుండా ఈ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అయితే ఒక సంవత్సరంలో క్రిప్టోకరెన్సీపై సంపాదించిన లాభాలపై 30 శాతం వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- కార్పొరేట్ బాండ్స్ : కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధి కోసం బాండ్స్ జారీ చేసి, ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తూ ఉంటాయి. ఇలా బాండ్స్ తీసుకున్నవారికి ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేట్స్ ఇస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ డేట్ వచ్చిన తరువాత అసలు, వడ్డీలను ఇన్వెస్టర్లకు అందిస్తూ ఉంటాయి. అయితే దీనిలో కాస్త రిస్క్ కూడా ఉంటుంది. కనుక మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ సంస్థల బాండ్లనే ఎంచుకోవాలి.
- గవర్నమెంట్ బాండ్స్ : ప్రభుత్వాలు సావరిన్ బాండ్స్ జారీ చేస్తుంటాయి. ఈ బాండ్స్ పూర్తి సురక్షితమైనవి. ఇన్వెస్టర్లకు దీనిపై ఫిక్స్డ్ ఇన్‌కం వస్తుంది. కనుక ఏమాత్రం నష్టభయం లేకుండా మంచి రాబడి సంపాదించాలని ఆశించేవారు ఈ గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి.
- పీర్-టు-పీర్ లెండింగ్ (P2P) : భారతదేశంలో ఆర్బీఐ నియంత్రణలోనే పీర్-టు-పీర్ లెండింగ్ కొనసాగుతుంది. కనుక న్యాయబద్ధంగా, పారదర్శకంగా పీర్-టు-పీర్ లెండింగ్ జరుగుతుంది. కాబట్టి పెట్టుబడిదారుల డబ్బులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చాలా ఆన్లైన్ పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం సంపాదించవచ్చు.
Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!