Bank Loan Credit Report Update Rule : బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తాము సేకరించే క్రెడిట్ రిపోర్టును 15 రోజులకు ఒకసారి కచ్చితంగా అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. గతంలో 30 రోజులకు ఒకసారి బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ నివేదికను అప్డేడ్ చేసేవి. తాజాగా ఆ గడువును 15 రోజులకు కుదిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం బ్యాంకులు నెలకు ఒకసారి సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును నివేదించాలి. ఈ నిర్ణయాన్ని మారుస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును అప్డేట్ చేయాలని కోరింది. ఈ నిర్ణయం అర్జెంట్‌గా లోన్ కావాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ రిపోర్టును చూసి లోన్లు మంజూరు చేస్తాయి.
ఆర్బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు ఉపయోగమేంటి?
రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఉదాహరణకు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఈజీగా లోన్లు మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే వారికి లోన్లు ఇస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడవు కూడా. అదే 550 సిబిల్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఇష్టపడవు. వారికి లోన్లు ఇవ్వడం ప్రమాదకరమని భావిస్తాయి. ఒకవేళ లోన్లు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.
ఆర్బీఐ నోటిఫికేషన్‌లోని ముఖ్య విషయాలు
బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) వారు సేకరించిన క్రెడిట్ సమాచారాన్ని 15 రోజులకొకసారి అప్డేట్ చేయాలి. అంటే నెలలోని 15వ రోజు, చివరి రోజు క్రమం తప్పకుండా అప్డేడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, సీఐసీలు సమర్పించిన క్రెడిట్ రిపోర్టు 7 రోజులలోపు నిర్ధరణ అవుతుంది. బ్యాంకుల నుంచి క్రెడిట్ నివేదికను కంపెనీలు ఐదు రోజుల్లో పొందొచ్చు. అంతకుముందు వారం రోజుల వ్యవధి ఉండేది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును సమర్పించని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై చర్యలు ఉంటాయి. పై నిబంధనలన్నీ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్నేషన్ కంపెనీలు అంతకు ముందే వీటిని అమలు చేయమని ఆర్బీఐ ప్రతిపాదించింది.
హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ - అదానీ గ్రూప్ స్టాక్స్ ఢమాల్ - Adani Shares Today Graph