Budget 2024 : చిన్నతరహా వ్యాపారాలు చేసుకునే వారికి కేంద్ర బడ్జెట్ నుంచి తీపి కబురు చెప్పింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024లో ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ముద్రా లోన్స్ తీసుకుని, సకాలంలో వాటిని తిరిగి చెల్లించినవారికి ఈ సదుపాయం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. దీనితో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కింద బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు (MFI) ముద్రా పథకం ద్వారా మూడు రకాల లోన్స్ ఇస్తాయి. అవి:
- శిశు (రూ. 50,000 వరకు రుణాలు)
- కిశోర్ (రూ 50,000 నుంచి రూ.5 లక్షల వరకు)
- తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు)
2024 బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం, ఇకపై తరుణ్ కేటగిరీ కింద ముద్రా రుణాలు రూ.20 లక్షల వరకు ఇస్తారు. అయితే ఈ ముద్ర లోన్‌లను మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా అందిస్తారు. ముద్ర లిమిటెడ్‌తో రిజిస్టర్ అయిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఈ రుణాలు అందిస్తాయి.
గ్యారెంటీ లేకుండా లోన్స్
దేశంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీంను నిర్మల అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆ కేటగిరీలోని సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా టర్మ్ లోన్లను మంజూరు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈల ఆర్థిక స్థితిగతులను కచ్చితత్వంతో అంచనా వేసే సామర్థ్యాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వరంగ బ్యాంకులను తీర్చిదిద్దుతామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలోని కొనుగోలు లావాదేవీలు నిర్వహించే సంస్థలకు ఊరట కలిగించేలా కీలక సవరణ చేశారు.
ఇంతకుముందు ఎంఎస్ఎంఈలు 'ట్రెడ్స్'(TReDs) పోర్టల్ ద్వారా ఏటా రూ.500 కోట్ల టర్నోవర్‌ను చేయాలనే టార్గెట్ ఉండేది. దీన్ని రూ.250 కోట్లకు తగ్గించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ల పరిధిలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) మరో 24 కొత్త బ్రాంచీలను తెరవనుందన్నారు.
కోటి మంది యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం; గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం రూ.2.66 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే ఐదేళ్లలో మరింత సమర్ధంగా అమలు చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోని కోటి మంది యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించేందుకు ప్రత్యేక స్కీంను అమలు చేస్తామని ఆమె వెల్లడించారు. దేశలోని 100 నగరాల్లో ఇన్వెస్ట్‌మెంట్ రెడీ ఇండస్ట్రియల్ పార్కులను అందుబాటులోకి తెస్తామన్నారు. పారిశ్రామిక రంగ కార్మికుల కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో డార్మిటరీ తరహా రెంటల్ హౌజింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని నిర్మల సీతారామన్ చెప్పారు. తొలిసారిగా విదేశాలలోని బొగ్గు గనుల వేలంపాటలో ప్రభుత్వం పాల్గొంటుందని, అక్కడి గనులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. బిహార్‌లో హైవేల నిర్మాణానికి రూ.20వేల కోట్లను బడ్జెట్‌లో ప్రకటించారు.
కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024