Income Disparity SBI Study : దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా తగ్గినట్లు శుక్రవారం విడుదల చేసిన ఎస్‌బీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2013-14 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వారిలో ఆదాయ అసమానతలు 74.2% మేర తగ్గాయని పేర్కొంది.
అసమానత అనేది ఒక అపోహ మాత్రమే!
భారతదేశంలో "విపరీతంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని" ప్రజల్లో భావన ఉంది. నిజంగా ఆదాయ అసమానతలు ఉన్నాయా? లేదా? అని పరిశీలించేందుకు ఎస్‌బీఐ ఆర్థిక విభాగం ఒక అధ్యయనం చేసింది. ఇందుకోసం 2014-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను విశ్లేషించింది. తాజాగా ఆ పరిశోధన నివేదికను విడుదల చేసింది.
ఈ ఎస్‌బీఐ అధ్యయనం ప్రకారం, '2015-2024 అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఆదాయ పంపిణీ వక్రరేఖ చాలా స్పష్టంగా కుడివైపునకు షిఫ్ట్ అయ్యింది. దీనిని బట్టి అల్పాదాయ బ్రాకెట్‌లో ఉన్న ప్రజలు తమ ఆదాయాన్ని బాగా పెంచుకున్నారని స్పష్టం అవుతోంది.'
"మా విశ్లేషణ ప్రకారం, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్న వారి మధ్య ఆదాయ అసమానతలు 74.2 శాతం క్షీణించాయి. ప్రభుత్వాలు చేస్తున్న నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు వల్ల, తక్కువ ఆదాయ వర్గాల వారి ఆదాయం పెరుగుతోంది" అని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. 'పన్ను సరళీకరణ విధానాలు ఐటీఆర్ ఫైలింగ్స్ పెరగడానికి ఏ విధంగా దోహదం చేశాయి' అనే శీర్షికతో ఎస్‌బీఐ ఈ నివేదిక విడుదల చేసింది.
వారి ఆదాయం గణనీయంగా పెరిగింది!
ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, "రూ.3.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తుల్లో ఆదాయ అసమానతలు 2014లో 31.8 శాతం ఉండగా, 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గిపోయాయి. వాస్తవానికి ఈ ఆదాయ బ్రాకెట్‌లోని జనాభా సంఖ్యతో పోల్చితే, వారి ఆదాయం 19 శాతం మేర పెరిగింది. రూ.5.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారి ఆదాయం కూడా గత దశాబ్ద కాలంలో బాగా వృద్ధి చెందింది( AY2020 కోవిడ్ మహమ్మారి సమయంలో మినహా)."
ఎస్‌బీఐ నివేదిక ప్రకారం
"మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో సంప్రదాయంగా అగ్రగామిగానే ఉన్నాయి. అయితే మొత్తం టాక్స్ ఫైలింగ్ బేస్‌లో వారి వాటా క్రమంగా తగ్గుతోంది.
ఆదాయ పన్ను ఫైల్ బేస్‌లో వాటాను పెంచుకోవడంలో ఉత్తర్‌ప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఆ తరువార బిహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రగతిశీల పన్ను విధానం వల్ల ప్రత్యక్ష పన్నులు బాగా పరిగాయి. దీంతో అసెస్‌మెంట్ ఇయర్ 2024లో పన్ను రాబడి 56.7 శాతానికి పెరిగింది. గత 14 ఏళ్లలో ఇదే అత్యధికం."
ప్రత్యక్ష పన్నులు - జీడీపీ రేషియో 2024 అసెస్‌మెంట్ ఇయర్‌లో 6.64 శాతం పెరిగాయి. 2000-01 నుంచి ఇదే అత్యధికం. ఇది పన్నుల చెల్లింపు సమ్మతి పెరుగుదలను సూచిస్తోంది.
2022 అసెస్‌మెంట్ సంవత్సరంలో మొత్తం 7.3 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. కానీ 2024 అసెస్‌మెంట్ ఇయర్‌లో ఏకంగా 8.6 కోట్లు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. ఇది అసాధారణ పెరుగుదల అని చెప్పుకోవచ్చు.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు కంటే ముందుగా మొత్తం 6.83 కోట్ల (79 శాతం) ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. గడువు తేదీ ముగిసిన తరువాత జరిమానాతో దాఖలు చేసిన ఐటీఆర్‌ల వాటా అసెస్‌మెంట్ ఇయర్ 2020లో గరిష్ఠంగా 60 శాతం ఉండగా, ఏవై2024 నాటికి 21 శాతానికి తగ్గాయి."