How To Set Up And Register An Ecommerce Company In India : భారతదేశంలో ఈ-కామర్స్ బిజినెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపుగా అందరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్స్ ఉండడం, తక్కువ ధరకే ఇంటర్నెట్ లభిస్తుండడం, లేటెస్ట్ బిజినెస్ టెక్నిక్స్ అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. అందుకే భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో, చాలా పెద్ద స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాదు నేటి డిజిటల్ టెక్నాలజీ సాయంతో చాలా వేగంగా ఆర్థిక లావాదేవీలు చేయడానికి, కస్టమర్లకు త్వరగా వస్తు, సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మన దేశంలో ఈ-కామర్స్ వ్యాపారానికి చాలా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మరి మీరు కూడా ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభిద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.
ఈ-కామర్స్ కంపెనీ అంటే ఏమిటి?
What is an E-commerce Company : ఈ-కామర్స్ కంపెనీని ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, వస్తు, సేవలను కస్టమర్లకు అందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. సాధారణంగా ఈ ట్రాన్సాక్షన్స్ 4 రకాలుగా ఉంటాయి. అవి:
- B2B (బిజినెస్ - టు - బిజినెస్)
- B2C (బిజినెస్ - టు - కన్జూమర్)
- C2C (కన్జూమర్ - టు- కన్జూమర్)
- C2B (కన్జూమర్ - టు - బిజినెస్)
ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల కలిగే లాభమేమిటి?
ఈ డిజిటల్ యుగంలో ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అవి:
- భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం. పైగా ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఇండియాలో ఇంటర్నెట్ చాలా చీప్‌గా లభిస్తోంది. కనుక ఈ-కామర్స్ వ్యాపారానికి కావాల్సినంత మంది కస్టమర్లు లభిస్తారు. పైగా ఇది డిజిటల్ మార్కెట్ ప్లేస్ కనుక ఇతర దేశాల కస్టమర్లు కూడా మీకు లభిస్తారు.
- సంప్రదాయ వ్యాపారాల కంటే, ఈ-కామర్స్ వ్యాపారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పైగా వ్యాపారం కోసం బిల్డింగ్లు, ఆఫీసులు లాంటివి స్థాపించాల్సిన పనిలేదు. కనుక పెట్టుబడి ఖర్చులు పెద్దగా ఉండవు. సప్లై చెయిన్ మేనేజ్మెంట్ ద్వారా కస్టమర్లకు సులువుగా వస్తు, సేవలు అందించవచ్చు.
- సంప్రదాయ వ్యాపారాలను రోజంతా నిర్వహించలేము. ఎందుకంటే షాప్ అయినా, ఆఫీస్ అయినా నిర్దిష్ట సమయం తరువాత వాటిని మూసివేయాల్సిందే. కానీ ఈ-కామర్స్ వెబ్సైట్లు 24x7 అందుబాటులో ఉంటాయి. కనుక కస్టమర్లకు చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మీకు కూడా మంచి వ్యాపారం జరుగుతుంది.
- భారతదేశంలో ఒక ఫ్యాక్టరీ, ఆఫీస్, షాపు మొదలైనవి పెట్టాలంటే, చాలా అనుమతులు అవసరం అవుతాయి. పైగా భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ-కామర్స్ వ్యాపారానికి ఇలాంటి సమస్యలు పెద్దగా ఉండవు.
- ఈ-కామర్స్ వ్యాపారాన్ని కాలానికి తగ్గట్టుగా మార్చుకోవడం చాలా సులువు. సంప్రదాయ వ్యాపారాల్లో ఇది చాలా కష్టం. అందువల్ల ఈ-కామర్స్ బిజినెస్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది.
- ఈ-కామర్స్ వ్యాపారం చేసేవాళ్లు కస్టమర్ల నుంచి చాలా విలువైన డేటాను సంపాదించడానికి వీలవుతుంది. ముఖ్యంగా కస్టమర్ల అభిరుచులు, అలవాట్లు, ప్రాధాన్యాలు, ఇష్టాఇష్టాలు, సాధారణ ప్రవర్తన, కొనుగోలు ప్రవర్తనలను తెలుసుకోవచ్చు. కనుక వినియోగదారులకు ఆకర్షించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం బిజినెస్ స్ట్రాటజీలను రూపొందించుకోవచ్చు.
- ఈ-కామర్స్ వ్యాపారంలో విభిన్న రకాలైన వస్తు, సేవలను అందించవచ్చు. కనుక మీ కస్టమర్ బేస్‌ను బాగా వృద్ధి చేసుకోవచ్చు. సంప్రదాయ వ్యాపారాల్లో ఇది అంత సులభం కాదు.
- మీ కస్టమర్లకు అనుగుణంగా కస్టమైజ్డ్ డీల్స్, రికమండేషన్స్ చేసి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. పైగా చక్కని సర్వీస్ కూడా ఇచ్చి వినియోగదారుల ఆదరాభిమానాలను పొందవచ్చు.
- మీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యానికి మీ వంతుగా చేయూత ఇవ్వవచ్చు. దీని వల్ల భారత్‌లో డిజిటల్ లిటరసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. పైగా భారత ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది.
- ప్రభుత్వం వివిధ పథకాలు ద్వారా దేశంలో డిజిటల్ బిజినెస్, ఈ-కామర్స్ వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. ఇవి కూడా మీకు కలిసివస్తాయి.
ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్
ఈ-కామర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారికి రెండు ఆప్షన్లు ఉంటాయి. అవి:
1. స్వయంగా ఈ-కామర్స్ వైబ్‌సైట్ క్రియేట్ చేసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టడం. లేదా
2. ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల్లో సెల్లర్‌గా నమోదు చేసుకోవడం.
ఇండియాలో ఈ-కామర్స్ కంపెనీని ప్రారంభించడం ఎలా?
మీకు ఏ మాత్రం అనుభవం లేకపోతే, ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఈ-కామర్స్ వెబ్సైట్లలో సెల్లర్‌గా రిజిస్టర్ చేసుకోవడం మంచిది. కానీ మీరు స్వయంగా వ్యాపారం చేసి, జీవితంలో ఎదగాలని అనుకుంటే, ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి. అందుకే ఇప్పుడు భారత్‌లో ఈ-కామర్స్ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
స్టెప్ -1 : మీ బిజినెస్ మోడల్‌ను ఎంచుకోండి.
భారతదేశంలో 4 రకాల బేసిక్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. అవి:
- B2B : బిజినెస్ టు బిజినెస్ (సంప్రదాయ వ్యాపారం)
- B2B E-Commerce : కంపెనీలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వ్యాపారం చేయడం.
- B2C : వ్యాపారులు నేరుగా వినియోగదారులకు వస్తు, సేవలు అమ్మడం.
- B2B2C : పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులకు వస్తు, సేవలు అమ్ముతారు. వాళ్లు కస్టమర్లకు వీటిని అందిస్తారు. మీరు వీటిలో ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ -2 : డొమైన్ రిజిస్ట్రేషన్
మీరు ఈ-కామర్స్ వ్యాపారం చేయాలంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి. కనుక మీ వ్యాపారానికి అనువైన, యుజర్లకు సులువుగా గుర్తుండే మంచి డొమైన్‌ను కొనుక్కోవాలి. ఈ డొమైన్ మీ బ్రాండింగ్‌కు, మార్కెటింగ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు www.amazon.com , www.flipkart.in లాంటి డొమైన్లను ఎంచుకోవాలి.
స్టెప్-3 : ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి
ఆన్లైన్ బిజినెస్ కోసం ఓ పక్కా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే కస్టమర్లకు అవసరమైన ప్రొడక్టులు, సర్వీసులు అన్నీ కనబడేలా దానిని తీర్చిదిద్దాలి. అలాగే పేమెంట్ గేట్‌వే కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సేల్స్ బాగా పెరుగుతాయి.
స్టెప్ -4 : బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి
వ్యాపారంలో బ్రాండింగ్ అనేది చాలా ముఖ్యం. అందుకే మీ వ్యాపారానికి తగిన బ్రాండ్ నేమ్‌ను, లోగోను ఎంచుకోవాలి. ముఖ్యంగా ట్రేడ్ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యాపారం బాగుంటుంది. మీ బ్రాండింగ్‌ను మరొకరు వాడకుండా రక్షణ ఏర్పడుతుంది.
స్టెప్ -5 : బిజినెస్ రిజిస్ట్రేషన్
మీ కంపెనీ పేరును కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇండియాలో ప్రధానంగా 4 రకాల బిజినెస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి:
- సోల్ ప్రొప్రైటర్‌షిప్ : ఒకే వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించి, దానిని నడిపిస్తారు.
- వన్-పర్సన్ కంపెనీ (OPC) : ఇది కూడా సోల్ ప్రొప్రైటర్‌షిప్ లాంటిదే. కానీ లిమిటెడ్ లయబిలిటీ ప్రొటక్షన్ ఉంటుంది.
- లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (LLP) : కొంత మంది వ్యక్తులు కలిసి భాగస్వాములుగా ఏర్పడి బిజినెస్ ప్రారంభిస్తారు. దీనిలో ప్రతి షేర్‌హోల్డర్‌కు లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది.
- ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ : కొంత మంది కలిసి ప్రైవేట్‌గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ షేర్హోల్డర్లు అందరికీ కలిపి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది.
వీటిలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ-కామర్స్ వ్యాపారం చేయాలని అనుకునేవారికి వన్-పర్సన్ కంపెనీ, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే, వ్యాపారం విస్తరించడానికి ఇవి అంత అనువుగా ఉండవు. కనుక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసుకోవడం మంచిది. లేదంటే సోల్ ప్రొప్రైటర్‌గా అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు.
స్టెప్ -6 : బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
కంపెనీ పేరు మీద కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇందుకోసం కంపెనీ పేరు మీద తీసుకున్న పాన్‌కార్డ్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సహా అవసరమైన అన్ని పత్రాలు బ్యాంకుకు సమర్పించాలి.
స్టెప్ -7 : ట్యాక్స్ రిజిస్ట్రేషన్/ జీఎస్టీ రిజిస్ట్రేషన్
మీ వ్యాపారం కోసం ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే మీ బిజినెస్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ మీరు సెల్లర్‌గా ఉండాలనుకున్నా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం లాంటివి జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న సప్లయర్స్‌కు మాత్రమే అవకాశం కల్పిస్తాయి. అంటే జీఎస్టీ నంబర్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు, ప్రొడక్ట్ సెల్లర్స్ మాత్రమే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో తమ వస్తు, సేవలు విక్రయించగలరన్నమాట.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలు :
- మీ బిజినెస్ పేరు మీద తీసుకున్న పాన్ కార్డ్
- సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ (మీరు కంపెనీ ప్రారంభించారనే విషయాన్ని ధ్రువీకరించే అధికారిక పత్రం)
- క్యాన్సిలేషన్ చెక్ (బ్యాంక్ చెక్‌పై అడ్డంగా గీతలు గీసి, క్యాన్సిల్ అని రాసి ఇవ్వాలి.)
స్టెప్ -8 : పేమెంట్ గేట్‌వే సెట్అప్
మీ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు ఒక పేమెంట్ గేట్‌వేను ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా సురక్షితంగా ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలవుతుంది. అయితే ఈ పేమెంట్ గేట్ చాలా సరళంగా, అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను కలిగి ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్, పేమెంట్ ఆన్ డెలివరి సహా అన్ని రకాల పేమెంట్స్ చేసే విధంగా ఇది ఉండాలి. అయితే పేమెంట్ గేట్‌వే ఏర్పాటు చేయాలంటే, మీ వెబ్సైట్లో కచ్చితంగా కొన్ని అంశాలు ఉండి తీరాలి. అవి:
- వెబ్సైట్ టెర్మ్స్ ఆఫ్ యూజ్
- వెబ్సైట్ ప్రైవసీ పాలసీ
- రీఫండ్ పాలసీ
- బ్యాంక్ అకౌంట్
- పాన్ కార్డ్
- సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్
- మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
- ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్
ఇప్పటికే ఉన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో సెల్లర్‌గా చేరాలంటే?
సొంతంగా ఈ-కామర్స్ వెబ్సైట్ ప్రారంభించి, వ్యాపారం చేయలేని వారు, ఇప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో సెల్లర్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎలాంటి కష్టం లేకుండా పెద్ద కస్టమర్ బేస్‌ను, రెడీ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పొందవచ్చు. మరి మీరు కూడా ఇలానే సెల్లర్ కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఏమేమి చేయాలంటే?
ముందుగా మీ బిజినెస్‌ను రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. తరువాత ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మీ బిజినెస్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత మీకు నచ్చిన ఈ-కామర్స్ సైట్లో రిజిస్టర్ చేసుకుని, ప్రొడక్ట్స్, సర్వీసెస్‌ను లిస్ట్ చేయాలి. వాటి కింద డిస్క్రిప్షన్స్తో పాటుగా, హైక్వాలిటీ ఇమేజెస్, వీడియోస్ పెట్టాలి. ఈ విధంగా మీరు సెల్లర్‌గా ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.
నోట్ : ప్రతీ రంగంలోనూ అవకాశాలు, ప్రతిబంధకాలు రెండూ ఉంటాయి. కనుక ముందుగానే తగినంతగా హోమ్‌వర్క్ చేసుకోవాలి. వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. లాభనష్టాలతోపాటు, రిస్క్‌ను, ఆపర్చూనిటీస్ను అంచనా వేసుకోవాలి. అంతేకాదు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆల్ ది బెస్ట్!