How To Protect Yourself From Cyber Crime : నేడు మన ఆర్థిక లావాదేవీలు అన్నీ డిజిటల్ మయం అవుతున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే కాదు, విద్యాధికులను సైతం మోసగించి, డబ్బులు కాజేస్తున్నారు. మోసపూరితంగా మన రహస్య సమాచారాన్ని తస్కరిస్తూ, మనం జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని దోచుకుంటున్నారు. అందుకే ఇలాంటి సైబర్ దాడుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
1. యూపీఐ పేమెంట్స్
దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. క్షణాల్లో చెల్లింపులు జరుగుతుండడమే ఇందుకు కారణం. దీనినే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే యూపీఐ లావాదేవీల కోసం మంచి పేరున్న, అధికారిక యాప్‌లనే వాడాలి. ప్లేస్టోర్ లాంటి సురక్షితమైన యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. అనధికారిక యాప్‌ల జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే మోసపూరిత లింక్‌లపై అస్సలు క్లిక్ చేయకూడదు.
2. క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్స్
నేడు ప్రతి ఒక్కరూ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ద్వారా చేసే లావాదేవీలకు కచ్చితంగా ఒక పరిమితి (లిమిట్) పెట్టుకోవాలి. ఇందుకోసం మీ బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్లో తగిన విధంగా క్రెడిట్ లిమిట్ సెట్ చేసుకోవాలి. అంతేకాదు ఆన్లైన్, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, ట్యాప్ అండ్ పేలకు కూడా పరిమితులు విధించుకోవాలి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలను అవసరమైతే తప్ప, ఎప్పుడూ నిలిపే ఉంచాలి. ఇలా చేయడం వల్ల, ఎవరైనా మీ క్రెడిట్, డెబిట్ కార్డులను అనధికారికంగా ఉపయోగించినా, మీ మొత్తం సొమ్మును దోచుకోలేరు. పైగా మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. దీని వల్ల మీకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఉంటుంది.
3. ఎవరితోనూ చెప్పకూడదు!
- మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలు - పిన్, లాగిన్, పాస్వర్డ్ లాంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదు. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో మీ సమాచారాన్ని ఎప్పుడూ పెట్టకోకూడదు. ఇతరులతో పొరపాటున కూడా వాటిని పంచుకోకూడదు.
- ఉచితంగా వచ్చింది కదా అని పబ్లిక్ వైఫైని ఎప్పుడూ వాడకూడదు. ఒకవేళ వాడినా బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రం చేయకూడదు.
- ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎలాంటి లావాదేవీలు జరిగినా, వెంటనే మీకు ఎస్ఎంఎస్, మెయిల్ రూపంలో సమాచారం వచ్చేలా చూసుకోవాలి.
- తరచుగా మీ క్రెడిట్ కార్డు లావాదేవీలు, బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అనధికారిక లావాదేవాలను గుర్తించడానికి వీలవుతుంది.
4. చెల్లింపుల విషయంలో జాగ్రత్త!
క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెల్లింపుల విషయంలో పిన్ను మీరే స్వయంగా నమోదు చేయాలి. పీఓఎస్ విషయంలో ఏదైనా తేడాగా అనిపిస్తే, వెంటనే సదరు లావాదేవీని ఆపేయాలి.
5. కొనుగోళ్లు చేసేటప్పుడు
సురక్షిత పేమెంట్ గేట్వేలను కలిగిన వెబ్సైట్లలో మాత్రమే కొనుగోళ్లు చేయాలి. అదనపు భద్రత కోసం మీ ఖాతాకు రెండు అంచెల అధీకృత (టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్) విధానాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.
6. మోసగాళ్ల మాటలు నమ్మవద్దు!
మీ బీమా పాలసీలకు ప్రీమియం చెల్లించాలి/ మీకు రావాల్సిన పార్శిల్ మా దగ్గర ఉండిపోయింది/ షేర్ల కొనుగోళ్ల కోసం రికమండేషన్స్ ఇస్తాం/ అంటూ వచ్చే ఫోన్లను, మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. మీకు ఒకవేళ ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే వాటిని కట్ చేయాలి.
ఒకవేళ మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ముందుగా మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. పోలీసులకు రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
రూ.90వేలలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Scooters Under 90000