How To Change Details In PF Account : మీరు ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) చందాదారులా? మీ పీఎఫ్ అకౌంట్లో ఏవైనా తప్పులున్నాయా? లేదా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలను మార్చుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది. 'జాయింట్ డిక్లరేషన్' ద్వారా మీ ఈపీఎఫ్ వివరాలను మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జాయింట్ డిక్లరేషన్ ఫారమ్
ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలను సరిచేసుకోవడానికి ఈ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరుతో పాటు లింగం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్ లాంటి 11 రకాల వివరాలు మార్చుకోవచ్చు. అయితే వీటిని అప్‌డేట్ చేయాలంటే, ఉద్యోగితో పాటు సంస్థ లేదా యాజమాన్యం కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు సంతకాలు చేసిన డిక్లరేషన్ ఫారాన్ని ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మీ పీఎఫ్ ఖాతాలోని వివరాలను అప్‌డేట్ చేస్తారు.
ఆన్లైన్లో పీఎఫ్ వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా!
- ముందుగా EPFO అఫీషియల్ పోర్టల్ అయిన epfoindia.gov.inను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజ్‌లో కనిపించే servicesపై క్లిక్ చేయాలి.
- స్క్రోల్ చేసి For Employees అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో కనిపించే services సెక్షన్‌లోకి వెళ్లి Member UAN/ online Service ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
- స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి, మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్‌లోడ్ చేయాలి.
- వివరాలు అన్నీ సబ్మిట్ చేసిన అనంతరం యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి.
- ఈ వివరాలు ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.
ఉద్యోగం మారుతున్నారా? మీ PF ఖాతాను సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా!
6కోట్ల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్- EPF వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు