Family Floater Health Insurance Policy : భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ఆర్థికంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించినదే ఆరోగ్య బీమా. సంపాదించే వ్యక్తిగా మీ ఆరోగ్యం, మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలను చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇందుకోసం ఆరోగ్య బీమా కొనుగోలు తప్పనిసరి. మీరు కూడా మీ కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ ఛాయిస్ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకునే ముందు మీ కుటుంబ పరిమాణం(కుటుంబ సభ్యుల సంఖ్య), ఇతర అంశాలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రీమియం ధరను నిర్ణయిస్తాయని తెలుసుకోవడం ముఖ్యం. మరెందుకు ఆలస్యం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అనేది కుటుంబ సభ్యులందరినీ ఒకే ప్లాన్ కింద కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీ. ఫ్యామిలీ ఫ్లోటర్‌లో కుటుంబ సభ్యులు అందరూ సభ్యులుగా ఉంటారు. అంటే ఒకే పాలసీ కుటుంబం మొత్తానికి కవరేజ్‌ను అందిస్తుంది. ఇది ఆరోగ్య అత్యవసర సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.
ఉదాహరణకు- గగన్ అనే వ్యక్తి తనకు, భార్య, ఇద్దరు పిల్లలను కుటుంబ ఫ్లోటర్ పాలసీని తీసుకున్నారనుకుందాం. మొత్తం బీమా కవరేజీ రూ.20 లక్షల అనుకుందాం. గగన్‌కు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరారు. అతడి ఆస్పత్రి బిల్లు రూ.6 లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు ఆయన ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని వాడుకోవచ్చు. ఆస్పత్రిలో బిల్లు రూ.6 లక్షలకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వగా, గగన్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఇంకా రూ.14 లక్షల బీమా అందుబాటులో ఉంటుంది.
అరవింద్ అనే వ్యక్తి రూ.5లక్షల విలువైన వ్యక్తిగత జీవిత బీమా కవరేజ్ ఉందనుకుందాం. ఆయన ఆస్పత్రి బిల్లు రూ.6 లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు అరవింద్ మరో రూ.లక్ష సొంత డబ్బును ఆస్పత్రికి కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా, పాలసీ వ్యవధిలో అరవింద్ అనారోగ్యం వల్ల మళ్లీ ఆస్పత్రిలో చేరాడనుకుందాం. అప్పుడు ఆయన మళ్లీ తన జేబులో నుంచి డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రీమియం కుటుంబ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉంటే ప్రీమియం పెరుగుతుంది. పాలసీ రెన్యూవల్ సమయంలో ఫ్యామిలీ ఫ్లోటర్‌లో కుటుంబ సభ్యులను చేర్చాలనుకుంటే వారి కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో కుటుంబంలో పెద్ద వయస్సు ఉన్న సభ్యుడిని దృష్టిలో వుంచుకుని ప్రీమియం నిర్ణయిస్తారు. అందుకే ప్రీమియంను తగ్గించుకోవడానికి, వృద్ధులకు ప్రత్యేక సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మంచిది. పాలసీ కవర్ అయిన కుటుంబ సభ్యుల వైద్య చరిత్ర, వృత్తి, జీవనశైలి కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.
ఉదాహరణకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్న కుటుంబ సభ్యుడు, ముందు నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటే బీమా కంపెనీలు ప్రీమియంను పెంచుతాయి. అదేవిధంగా బీమా తీసుకున్న వ్యక్తి అధిక రిస్క్ ఉన్న ఉద్యోగం చేస్తుంటే పాలసీ ప్రీమియం పెరుగుతుంది.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్య బీమా కవరేజ్ కిందకి తీసుకురావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
- ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది పాలసీదారులకు విస్తృత కవరేజీని అందించే సమగ్ర ప్రణాళిక. ఆస్పత్రి బిల్లులు, ఆస్పత్రికి వెళ్లే ముందు ఖర్చులు, డొమిసిలియరీ కేర్, డేకేర్ విధానాలు, ఆయుష్ చికిత్స వంటి వాటిని ఈ పాలసీ కవర్ చేస్తుంది.
- ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్లాన్ కనీసం ఇద్దరు, గరిష్ఠంగా ఎనిమిది మంది కుటుంబ సభ్యులను కవర్ చేస్తుంది. అందువల్ల, వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్లాన్‌తో పోల్చినప్పుడు ఈ పాలసీ కవరేజీ కాస్త ఎక్కువగా ఉంటుంది. పాలసీలో సభ్యుడైన కుటుంబీకుడికి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మీరు బిల్లుల గురించి చింతించకుండా నాణ్యమైన వైద్యాన్ని సకాలంలో చేయించవచ్చు.
- వ్యక్తిగత ఆరోగ్య బీమాతో పోలిస్తే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రీమియం కాస్త తక్కువే ఉంటుంది. పాలసీ రెన్యూవల్ సమయంలో కుటుంబ సభ్యులను తొలగించుకోవచ్చు లేదా చేర్చుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీ ఆర్థిక భద్రతను కాపాడుతుంది.
టూవీలర్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్- బైక్స్, స్కూటర్స్ ధరలు పెంచనున్న హీరో