EPS Withdrawal Rules Changed : తరచూ ఉద్యోగాలు మారే వారికి శుభవార్త అందిస్తూ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల్లో ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులు ఈపీఎస్‌లో డిపాజిట్ చేసిన నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈపీఎస్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం 6 నెలల సర్వీస్ ఉండాలనే రూల్ ఉండేది. తాజాగా దాన్ని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 7 లక్షల మంది పీఎఫ్ చందాదారులకు ఊరట కలిగింది.
కొత్త రూల్ ఏంటి?
ఇప్పటి వరకు, 6 నెలల సర్వీస్ పూర్తి కాకముందే జాబ్ వదిలిపెట్టిన లేదా మారిన ఉద్యోగులు తమ ఈఫీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను మాత్రమే విత్‌డ్రా చేసుకోగలిగేవారు. ఈపీఎస్‌లోని నగదును విత్‌డ్రా చేసుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్‌తో ఆరు నెలల సర్వీర్ పూర్తికాకపోయినా ఉద్యోగులు తమ ఈపీఎఫ్, ఈపీఎస్ కాంట్రిబ్యూషన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ ఎంతంటే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పథకం కింద ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. అంతేమొత్తాన్ని యజమాని జమ చేస్తాడు. అయితే యజమాని చెల్లించే ఈ 12 శాతం వాటాలో 8.33శాతం ఈపీఎస్‌లోకి, మిగతా 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది.
ఈ సవరణ వల్ల ప్రయోజనం ఏమిటి?
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సవరణ వల్ల ఆరు నెలలకన్నా తక్కువ సర్వీసు ఉన్న 7లక్షల మంది ఈపీఎస్ చందాదారులకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా టేబుల్ 'డీ'లో కూడా కేంద్రం మార్పులు చేసింది. దీని ద్వారా నెల వారీగా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఉద్యోగులకు ఈపీఎస్ ప్రయోజనాలు లభిస్తాయి.
టేబుల్ డీ అంటే ఏమిటి?
ఈపీఎస్ పథకం అర్హతకు అవసరమైన సేవలను అందించని సభ్యులు లేదా 58 ఏళ్లు నిండిన సభ్యులను టేబుల్ డీ సూచిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఈపీఎస్ సభ్యులు చాలా మంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. పదేళ్ల కాంట్రిబ్యూటరీ సర్వీస్ లేకపోవడం ఇందుకు కారణం. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షలకుపైగా ఈపీఎస్ విత్‌డ్రా క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.