Emergency Fund Vs Personal Loan : ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు అత్యవసరంగా డబ్బులు అవసరం అవుతాయి. ఈ అవసరాలకు మన దగ్గర డబ్బు లేనప్పుడు, అత్యవసర నిధిని వినియోగించాలా? లేదా వ్యక్తిగత రుణం తీసుకుని ఆ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏది ఎంచుకోవాలి? దాని వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యవసర నిధి
When To Use Emergency Fund : అత్యవసర నిధి అనేది ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటుంది. ఈ అత్యవసర నిధులు సాధారణంగా బ్యాంకు పొదుపు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్ల వంటి సులభంగా యాక్సెస్ చేయగల ఖాతాలలో ఉండడం మంచిది. అత్యవసర నిధి అనేది ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం రుణాలపాలు కాకుండా కాపాడుతుంది. అందుకే 6 నుంచి 12 నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సొంత నిధి కాబట్టి, అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరం ఏర్పడినప్పుడు దానిని మీరు వాడుకోవచ్చు. కనుక అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేయనక్కరలేదు. కనుక క్రెడిట్ స్కోరుతో కూడా ఉండదు. కానీ, కొన్నిసార్లు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిధి సరిపోకపోవచ్చు. మీ అత్యవసర నిధిలో ఎంత నగదు నిల్వ ఉంది? ఎలాంటి ఖర్చులకు సరిపోతుందనేది చాలా కీలకం. అత్యవసర నిధిని ఉపయోగించడం వల్ల రుణ బాధ్యత ఉండకపోయినప్పటికీ, ఏదైనా కారణం చేత దాని నుంచి కొంత నగదు వాడుకున్నప్పుడు, వీలైనంత త్వరగా ఆ నిధిని మళ్లీ పునరిద్ధరించుకోవడం మంచిది.
అత్యవసర నిధిని ఏ అవసరాలకు వాడాలి?
- వైద్య ఖర్చులు : ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. భవిష్యత్‌లో మరింతగా పెరిగిపోతాయి. కనుక ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అత్యవసర నిధి మీకు భరోసానిస్తుంది.
- ఉపాధి కోల్పోవడం : ఒక్కోసారి స్వల్పకాలం పాటు మనం ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవచ్చు. లేదా ఆదాయం తగ్గిపోవచ్చు. ఇలాంటప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేవరకు అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.
- రిపేర్లు : హఠాత్తుగా కారు రిపేరు కావచ్చు. లేదా ఇంటికి అత్యవసర మరమ్మతులు లాంటివి చేయాల్సి రావచ్చు. ఇలాంటి అవసరాలను తప్పించుకోవడానికి వీలుండదు. వీటి ఖర్చుల కోసం లోన్ తీసుకోకుండా అత్యవసర నిధిని వాడవచ్చు.
- కుటుంబ అవసరాలు : కొన్ని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు గానీ, బంధువులకు గానీ తీవ్ర ప్రమాదాలు, మరణం లాంటివి సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి ఖర్చులను తప్పించుకోవడానికి వీలుండదు. కనుక, వీటికి అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.
వ్యక్తిగత రుణం
When To Take A Personal Loan : బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తిగత రుణాలు ఇస్తుంటాయి. మన దగ్గర అత్యవసర నిధి లేనప్పుడు లేదా ఉన్న నిధి సరిపోనప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, వివిధ ఆన్‌లైన్ రుణ సంస్థల వద్ద తీసుకోవచ్చు. గృహ, కారు రుణాల మాదిరిగా కాకుండా, పర్సనల్ లోన్స్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిపై విధించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండాయి. రీపేమెంట్ నిబంధనలు కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా ఈ రుణాలు లభిస్తున్నాయి. ఈ రుణాన్ని ఎలాంటి ఖర్చులకయినా ఉపయోగించుకోవచ్చు. రుణాన్ని తీర్చడానికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. కానీ సకాలంలో రుణం తీర్చకపోతే భారీ జరిమానాలుంటాయి. పైగా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. అందుకే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకున్నప్పుడు, మీ ఆదాయం ఎంత స్థిరంగా ఉందనేది చూడాలి. స్థిరమైన ఆదాయం ఉన్నప్పుడు లోన్ తిరిగి చెల్లించడం సులభం అవుతుంది.
ఎలాంటి ఖర్చులకు వాడాలి?
- రుణం : మీ దగ్గర తగినంత అత్యవసర నిధి లేనప్పుడు, విద్య, వైద్య ఖర్చుల కోసం, ముఖ్యమైన ఉపకరణాల మరమ్మతుల కోసం వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు.
- రుణ ఏకీకృతం : మీరు ఇప్పటికే అధిక వడ్డీ రేట్లతో అప్పులు తీసుకుని ఉంటే, వాటిని తక్కువ వడ్డీ రేటుతో తీసుకున్న పర్సనల్‌తో ఏకీకృతం చేయవచ్చు. దీనివల్ల వడ్డీ చెల్లింపులపై కొంత వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. రుణం ఒక్కటిగా ఉండడం వల్ల తిరిగి చెల్లింపుల వ్యూహాన్ని మెరుగ్గా అమలుచేయవచ్చు.
- చదువు కోసం : ప్రస్తుతం ప్రతి కుటుంబం విద్యకు ఎనలేని ప్రాముఖ్యతనిస్తోంది. విద్యా రుణాలు తక్కువ వడ్డీకి లభించినప్పటికీ, కొంతమంది వ్యక్తిగత రుణాన్ని తీసుకుని ట్యూషన్ ఫీజులు, ఇతర విద్యా ఖర్చులకు ఉపయోగిస్తారు. రుణాన్ని స్వల్వవ్యవధిలోనే తీర్చేస్తారు. ఇలాంటి వాటికి వ్యక్తిగత రుణాలు బాగా ఉపయోగపడతాయి.
- వివాహ ఖర్చులు : వివాహ ఖర్చులకు తమ పొదుపులు సరిపోకపోతే, చాలా మంది వ్యక్తిగత రుణాలపైనే ఆధారపడతారు.
- రాబడి అవకాశాలు : కొన్నిసార్లు, తక్కువ డబ్బులు అవసరమయ్యే పెట్టుబడి మార్గాలు లేదా వ్యాపార అవకాశాలు వస్తాయి. వీటిపై అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో పెట్టుబడిపై అధిక రాబడిని పొందేందుకు ఒక పటిష్ఠమైన ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే, వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు.
చివరిగా : అత్యవసర నిధులు రుణ భారం లేకుండా భద్రతా వలయాన్ని కల్పిస్తాయి. వ్యక్తిగత రుణాలు మీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ వాటిని మీరు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర నిధిని ఉపయోగించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత రుణాలు తీసుకోవాలి. మళ్లీ వాటిని బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించాలి. అప్పుడే మీరు ఆర్థికంగా బాగుంటారు.
పర్సనల్ లోన్ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే!