Elon Musk Sues OpenAI : ప్రఖ్యాత ఏఐ చాట్‌బోట్ ‘చాట్ జీపీటీ’ తయారీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’తో ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వివాదం ముదురుతోంది. ‘ఓపెన్ ఏఐ’ కంపెనీ, దాని ఇద్దరు వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లపై ఎలాన్ మస్క్ కోర్టులో దావా వేశారు. ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలనే కంపెనీ వ్యవస్థాపక లక్ష్యాలను ఓపెన్ ఏఐ విస్మరించడం ద్వారా మోసానికి పాల్పడిందని, లాభాల సముపార్జనకే ఇప్పుడది ప్రాధాన్యమిస్తోందని మస్క్ ఆరోపించారు. ఈమేరకు అభియోగాలతో సోమవారం ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఆయన దావా వేశారు. ‘‘ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులు ఉద్దేశపూర్వకంగానే మస్క్‌ను మోసగించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వల్ల మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాలపై ఆయన ఆందోళనగా ఉన్నారు’’ అని ఆయన తరఫు నాయవాది ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఓపెన్ ఏఐతో మస్క్‌కు సంబంధం ఏమిటంటే?
ఇంతకీ ఓపెన్ ఏఐ కంపెనీతో ఎలాన్ మస్క్‌కు సంబంధమేంటి అనుకుంటున్నారా? దానికి సమాధానం తెలియాలంటే మనం 2015 సంవత్సరంలోకి వెళ్లాలి. ఆ ఏడాదిలోనే ఓపెన్ ఏఐ కంపెనీని స్థాపించారు. అప్పట్లో ఓపెన్ ఏఐలో పెట్టుబడి పెట్టిన వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఆనాటి నుంచే కంపెనీ బోర్డులో ఆల్ట్‌మాన్ కూడా ఉన్నారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోనూ ఈ వివరాలను మస్క్ ప్రస్తావించారు. ‘‘ఓపెన్ ఏఐ ఏర్పడిన తొలినాళ్లలో నేను కోట్లాది రూపాయలను అందులో పెట్టుబడిగా పెట్టాను. అగ్రగామి ఏఐ రీసెర్చ్ సైంటిస్టులను ఆనాడు మేం రిక్రూట్ చేశాం. 2018 తొలినాళ్లలో నేను ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశాను. నా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కోసం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని తయారు చేస్తున్నందున వైరుధ్యాలను నివారించే ఉద్దేశంతో ఓపెన్ ఏఐ బోర్డు నుంచి ఆనాడు వైదొలిగాను’’ అని మస్క్ పేర్కొన్నారు.
గతంలోనూ ఓ దావా వేసి వెనక్కి తీసుకున్న మస్క్
ఓపెన్ ఏఐపై గతంలోనూ ఓ దావాను ఎలాన్ మస్క్ వేశారు. ‘‘ఓపెన్ ఏఐను నాన్ ప్రాఫిట్ కంపెనీగా ఉంచుతామని గతంలో ఆల్ట్‌మాన్, బ్రాక్‌మాన్‌లు నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓపెన్ ఏఐ కోడ్‌ను ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆ ఒప్పందాన్ని వాళ్లు ఉల్లంఘించారు’’ అని గత పిటిషన్‌లో టెస్లా అధినేత వాదించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో స్పందించిన ఓపెన్ ఏఐ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీని లాభాల కోసం నడిపేందుకు అంగీకారం తెలుపుతూ ఎలాన్ మస్క్ గతంలో పంపిన ఈమెయిల్స్ ఆధారాలను విడుదల చేసింది. దీంతో నాలుక కరుచుకున్న మస్క్ జూన్‌లో ఆ దావాను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఎలాన్ మస్క్ దాఖలు చేసిన దావాపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ ‘‘మస్క్ గతంలో చేసిన మెయిల్సే అన్నింటికీ సాక్ష్యాలు. అందులోనే అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి’’ అని తేల్చి చెప్పింది.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా - నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్! - Muhammad Yunus