Does Closing A Credit Card Hurt Your Credit : నేటి డిజిటల్ యుగంలో దాదాపుగా అందరూ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్, షాపింగ్ - ఇలా ఒక్కోదాని కోసం ఒక్కో క్రెడిట్ కార్డును తీసుకుంటున్నారు. దీనితో అనవసరపు ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది తమ దగ్గర ఉన్న పెద్దగా వాడుకలో లేని క్రెడిట్ కార్డ్‌లను క్లోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? మరి ఇలా చేయడం లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
క్రెడిట్ కార్డు పరిమితిలో ఎంత శాతం వరకు వాడుకున్నామో తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR). క్రెడిట్ వినియోగంలో దీని పాత్ర చాలా కీలకం. ఎల్లప్పుడూ ఈ రేషియో 30 శాతానికి మించకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీంతో సీయూఆర్ రేషియో క్రమంగా పెరిగి అది మీ క్రెడిట్ స్కోర్‌పై చెడు ప్రభావం చూపుతుంది. అది ఎలాగంటే?
ఉదాహరణకు, మీ దగ్గర 3 క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయని అనుకుందాం. మొదటి క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.1 లక్ష; రెండో క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.2 లక్షలు; మూడో క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3 లక్షలు ఉందని అనుకుందాం. అంటే ఈ 3 కార్డులు కలిపి మీ క్రెడిట్ లిమిట్ రూ.6 లక్షలు అన్నమాట. అందులో మీరు రూ.1.80 లక్షలు వినియోగించారనుకుందాం. అంటే మీ సీయూఆర్ 30 శాతం. ఒకవేళ మీరు అదనపు క్రెడిట్ కార్డులను వద్దనుకుని మూడో క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే, అప్పుడు మీ లిమిట్ రూ.3 లక్షలకు పడిపోతుంది. ఇప్పుడు అదే స్థాయిలో మీరు క్రెడిట్ కార్డును వినియోగిస్తే సీయూఆర్ 60 శాతానికి చేరుకుంటుంది.
క్రెడిట్ హిస్టరీపై ప్రభావం
క్రెడిట్ హిస్టరీ కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒక వేళ మీ పాత క్రెడిట్ కార్డ్ హిస్టరీ మెరుగ్గా ఉంటే రుణ మంజూరు సులభం అవుతుంది. మంచి హిస్టరీ ఉన్న క్రెడిట్ కార్డ్‌ని వినియోగించడం లేదన్న ఒకే కారణంతో తీసేస్తే, క్రెడిట్ హిస్టరీపై దాని ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
ఆఫర్లు సంగతేంటి?
ఫ్రీ లాంజ్ యాక్సెస్, బ్రాండెడ్ వస్తువులపై ఆఫర్స్, సినిమా టికెట్లపై డిస్కౌంట్స్ - ఇలా ప్రతి క్రెడిట్ కార్డ్ కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ఈ కార్డ్‌లను తరచూ వినియోగించకపోయినా, వాటి అదనపు ప్రయోజనాలను మాత్రం పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉన్న అదనపు క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేద్దామని అనుకుంటే, భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని తగు నిర్ణయం తీసుకోవాలి.
ఏ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలి?
లాభాలు ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డులను అలానే ఉంచేస్తే వాటి నిర్వహణ చాలా కష్టమవుతుంది. సకాలంలో పేమెంట్లు చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కనుక అవసరంలేని కొన్ని కార్డులను వదిలించుకోవడమే మంచిది. కనుక తక్కువ ఆఫర్లు కలిగి, క్రెడిట్ లిమిట్ కూడా పరిమితంగానే ఉండే కార్డులను రద్దు చేసుకోవాలి. కొన్ని కార్డులకు వార్షిక రుసుములు ఎక్కువగా ఉంటాయి. అలాంటి క్రెడిట్ కార్డ్‌లను కూడా వదిలించుకోవడమే మంచిది. ఇలా అవసరం లేని క్రెడిట్ కార్డులను తీసేటప్పుడు, మీ క్రెడిట్ హిస్టరీపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవడం ముఖ్యం. అంతే కాదు, ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను తీసేయడం కూడా మంచిది కాదని మీరు గుర్తుంచుకోవాలి.