Credit Card Issued Without Consent : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కస్టమర్ సమ్మతితో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. కస్టమర్ల నుంచి అప్లికేషన్ స్వీకరించి కార్డులను ఇస్తున్నాయి. అయితే, ఒక్కోసారి అప్లై చేయకుండానే కొన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. కస్టమర్ల సమ్మతి లేకుండానే వీటిని ఇంటికి పంపిస్తున్నాయి. ఇలా వచ్చే క్రెడిట్ కార్డుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఈ కార్డును ఏం చేయాలి? దీనివల్ల ఎదురయ్యే సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అలా చేస్తే చాలా ప్రమాదం!
అప్లై చేయకుండా వచ్చిన క్రెడిట్ కార్డును వేరొకరు వినియోగించే ప్రమాదం ఉంది. మీ క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవడం, అప్పులు చేయడం వంటివి మోసాలకు పాల్పడవచ్చు. దీంతో మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేగాకుండా, మీ క్రెడిట్ కార్డుతో అనధికార కార్యకలాపాలకు పాల్పడొచ్చు. చట్టపరమైన నేరాల్లో మిమ్మల్ని ఇరికించవచ్చు. అందుకే, ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ విషయంలో జాగ్రత్త అవసరం. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల (Non-Banking Financial Company) నుంచి అప్లై చేయకుండా వచ్చే క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేయకూడదు. ఓటీపీ, పిన్ వంటివి జనరేట్ చేయకూడదు. అప్పుడే క్రెడిట్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. మీరు అప్లై చేయలేదు కాబట్టి ఎలాంటి ఛార్జీలు విధించినా చెల్లించనక్కర్లేదు.
బ్యాంకు, ఎన్బీఎఫ్సీని సంప్రదించండి
ఒకవేళ మీరు అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డు మీకు వస్తే వెంటనే సదరు బ్యాంకు, ఎన్బీఎఫ్సీను సంప్రదించాలి. ఈ విషయాన్ని వారికి తెలియజేస్తే కార్డును రిటర్న్ తీసేసుకుంటారు. కొన్నిసార్లు బ్యాంకుల పేరిట ఫేక్ కార్డులను సైబర్ నేరగాళ్లు జారీ చేస్తారు. కాబట్టి, ఫిర్యాదు చేస్తే సమస్య ఉండదు. కస్టమర్ సర్వీస్ నంబర్‌కు డయల్ చేసి సమస్య చెప్పవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు.
'ఆర్బీఐ జరిమానా విధిస్తుంది'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం కస్టమర్ సమ్మతి లేనిదే క్రెడిట్ కార్డ్ జారీ చేయకూడదు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ లేదా ఎన్ బీఎఫ్సీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆర్బీఐ జరిమానా విధిస్తుంది.
'కంప్లైంట్ ప్రక్రియను రికార్డ్ చేయాలి'
ఆయాచిత క్రెడిట్ కార్డులను తీసుకున్నప్పుడు కస్టమర్లు సదరు సంస్థకు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే ఈ కంప్లైంట్ ప్రక్రియను రికార్డ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్లు తర్వాత ఉపయోగపడొచ్చు. ఒకవేళ సంస్థ తగిన విధంగా స్పందించకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ప్రక్రియలో ఏవైనా వివాదాలు తలెత్తినా ఈ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా పనికొస్తాయి.