Can Employees Transfer Their EPF To NPS : భారతదేశంలోని పెన్షన్ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్), జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్) అందరికీ గుర్తొస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఏకమొత్తంలో నగదు సహా, నెలవారీ పెన్షన్‌ను అందించడమే ఈ పథకాల లక్ష్యం. కానీ ఈ రెండింటికీ మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉంది. ఈపీఎఫ్ అనేది వడ్డీ రేటు ఆధారిత గ్యారెంటీ రిటర్న్ పథకం. ఎన్‌పీఎస్ అనేది మార్కెట్ ఆధారత పెట్టుబడి పథకం. అయితే చాలా మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నగదును ఎన్‌పీఎస్ పథకానికి బదిలీ చేయవచ్చా? ఆ ప్రాసెస్ ఏంటి? అనే సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలకు సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాతీయ పెన్షన్ స్కీమ్ మార్కెట్ లింక్డ్ పథకం. ఇది దీర్ఘకాలంలో ఈపీఎఫ్ కంటే మెరుగైన రాబడిని అందించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొందరు ఈపీఎఫ్ మొత్తాన్ని ఎన్పీఎస్కు బదిలీ చేసుకోవాలని ఆశిస్తారు. మరి అలా చేయవచ్చో, లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అంత కంటే ముందు ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF)
గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఈపీఎఫ్ డిపాజిట్‌పై 8.25 శాతం వార్షిక చక్రవడ్డీని ఈపీఎఫ్ఓ అందిస్తుంది. అలాగే ఈపీఎఫ్ చందాదారులకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఈపీఎఫ్ డిపాజిటర్లకు పన్ను మినహాయింపు ఉంటుంది.
జాతీయ పెన్షన్ పథకం (NPS)
18 నుంచి 70 ఏళ్ల వయస్సున్న భారతీయ పౌరులు అందరూ జాతీయ పెన్షన్ పథకంలో చేరవచ్చు. పాన్, బ్యాంకు వివరాల ద్వారా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్- సర్వీస్ ప్రొవైడర్స్ (POP-SP) లేదా eNPS వెబ్సైట్ ద్వారా అకౌంట్ తెరవవచ్చు. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. అవి టైర్-1 ఖాతాలకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే నిర్దిష్ట గడువు ముగిసే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉండదు. దీంట్లో పన్ను ప్రయోజనాలు ఉంటాయి. టైర్- I ఖాతాదారులు సెక్షన్ 80సీసీడీ (1) కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మరొకటి టైర్-II ఖాతా. దీనికి లాకిన్ పీరియడ్ ఉండదు. దీంట్లో నుంచి డబ్బు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ, పన్ను ప్రయోజనాలు ఉండవు. కనీసం రూ.500 రూపాయలతో టైర్-1 ఖాతాను ప్రారంభించవచ్చు. అయితే ఏటా కనీసం రూ.1000 చొప్పున దీనిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. రూ.250తో టైర్-2 ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
ఎవరైనా ఈపీఎఫ్‌లోని నగదును ఎన్పీఎస్కు బదిలీ చేయవచ్చా?
'అవును' చేయవచ్చు. ఉద్యోగి తన ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నగదును టైర్-1 ఎన్‌పీఎస్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. దీని కోసం తన యజమానికి ఒక రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫారంను యజమాని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని పంపుతారు. ప్రైవేట్ ఉద్యోగి అయితే నేమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్, కలెక్షన్ అకౌంట్-NPS ట్రస్ట్ - సబ్‌స్క్రైబర్ నేమ్ - పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరు పేరిట చెక్/డీడీ తీయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి అయితే నోడల్ ఆఫీస్ పేరు - యజమాని పేరు - శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) పేరిట చెక్/డీడీని తీయాల్సి ఉంటుంది. దీనితో ఈపీఎఫ్ఓ మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును ఎన్పీఎస్కు బదిలీ చేస్తుంది.
మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? 'గ్రేస్ పీరియడ్'ను తెలివిగా వాడుకోండిలా! - Credit Card Grace Period
మీరు SBI ఖాతాదారులా? ఈ సర్వీసులు గురించి తెలుసుకోవడం మస్ట్! - SBI BALANCE CHECK