Bill Gates Time Management Lessons : బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని ఆయన నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్ అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెప్పారు. వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ తెలుసుకున్న ఆ సలహా ఏంటో తెలుసుకుందాం.
"జీవితంలో, వ్యాపారంలో విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్లోని ప్రతి సెకనును షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని బిల్ గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే, ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.
బఫెట్ క్యాలెండర్
మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ, తన సమయాన్ని మైక్రో మేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో వారెన్ బఫెట్‌తో కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని పని విధానమే తన విజయానికి మార్గమని బిల్ గేట్స్ గతంలో విశ్వసించారు. అయితే, వారెన్ బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావనను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు.
మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి!
"వారెన్ బఫెట్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు చాలానే ఉన్నాయి. బఫెట్ షెడ్యూల్ నాకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు" అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు.
వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మధ్య మంచి స్నేహబంధం
బిల్ గేట్స్ 2000 వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగారు. ఆయనకు వారెన్ బఫెట్‌తో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ పలు వేదికలపై తమ స్నేహ బంధం గురించి మాట్లాడారు.
మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing