Best Tips for Women Can Grow Their Wealth : ప్రస్తుత రోజుల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా సంపాదిస్తూ.. విభిన్న రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అయినా కొందరు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో విఫలమవుతుంటారు. ఇంకొందరు డబ్బు సంపాదించినా వాటిని ఎలా పొదుపు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. దీనికి ప్రధాన కారణం వారి దగ్గర సరైన ఐడియాలు లేకపోవడమే. అలాకాకుండా ఈ ఫైనాన్షియల్(Financial) టిప్స్ ఫాలో అయ్యారంటే సంపదను వృద్ధి చేసుకోవడమే కాదు భవిష్యత్తు అవసరాలకు తగిన డబ్బును పొదుపు చేసుకోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఫైనాన్షియల్ ఎడ్యూకేషన్ : ఆర్థిక స్వాతంత్య్రానికి పునాది విద్య. కాబట్టి మహిళలు తమ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా బడ్జెటింగ్, పెట్టుబడులు, రుణ నిర్వహణ వంటి అంశాలను అర్థం చేసుకోవడం వల్ల ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా వారికి అధికారం లభిస్తుంది. ఇందుకోసం ప్రస్తుత మార్కెట్లో అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయి. అవి మహిళలు తమ ఆర్థిక చతురతను పెంపొందించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి.
కెరీర్ ప్లానింగ్ : సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడం, ప్రతిష్టాత్మకమైన వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడం మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అతివలు ఆర్థికంగా దూసుకుపోవాలంటే తమ నైపుణ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా కెరీర్ అవకాశాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును పొందేందుకు జీతాల చర్చలు, ప్రమోషన్లు కోరడం, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవడం లాంటివి చేయాలంటున్నారు.
పొదుపు అలవాటు : మహిళలు ఆర్థికంగా రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం అత్యవసర నిధిని సృష్టించడం, పదవీ విరమణ ప్రణాళికలకు సహకరించడం, పెట్టుబడులకు ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించడం వంటివి చేయాలంటున్నారు. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ఎంత సంపాదిస్తున్నా చాలట్లేదా? ఈ టిప్స్‌తో మినిమమ్ ఉంటది!
స్మార్ట్ ఇన్వెస్టింగ్ : సంపద సృష్టికి పెట్టుబడి ఒక శక్తివంతమైన సాధనం. కాబట్టి మహిళలు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు(SIP)లు వంటి పెట్టుబడి ఎంపికలను అన్వేషించాలి. ముఖ్యంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియో అనేది నష్టాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వృద్ధి సంభావ్యతను పెంచుతుంది. అవసరమైతే మంచి పెట్టుబడుల కోసం ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలి.
ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ : మహిళల సంపద సృష్టికి ఎంటర్ప్రిన్యూరియల్ వెంచర్లు లేదా సైడ్ బిజినెస్‌లను అన్వేషించడం కూడా గణనీయంగా దోహదపడుతుంది. ప్రస్తుత మార్కెట్లో చాలా స్టార్టప్ సంస్థలు మహిళలకు వారి నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా సెట్ అవ్వడానికి అనేక అవకాశాలను అందిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం కూడా మహిళలు తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి చాలా బాగా తోడ్పడతాయి. ఇది మంచి ఆదాయ వనరుగా లేదా ఆర్థిక భద్రతా వలయంగా ఉపయోగపడుతుంది. అయితే ఇటువంటి పెట్టుబడులు పెట్టడానికి ముందు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి, అందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి లాభాలు పొందువచ్చు అనే అంశాలపై అవగాహన చాలా అవసరం.
ఆరోగ్య బీమా : వీటితో పాటు మహిళలు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, సంపదను పెంచుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని ఆరోగ్య బీమా తీసుకోవడం. ఇది ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహిళలకు ఊహించని ఆరోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఆర్థికంగా చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా తమతో పాటు కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించడమే కాకుండా భవిష్యత్తు పెట్టుబడులను రక్షించడంలోనూ సహాయపడుతుంది.