India Post Office Accidental Insurance Schemes : రోడ్డు యాక్సిడెంట్స్ కుటుంబాల్లో వ్యక్తులనే కాదు.. మొత్తం కుటుంబాన్నే కష్టాల్లోకి నెట్టేస్తాయి. ఒకవేళ ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకోవాల్సిందే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ప్రమాద బీమా(Accidental Insurance) చేయించుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆరోగ్య బీమా, జీవిత బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకోవాల్సిన అవసరముందంటున్నారు. అయితే, చాలా మంది ప్రీమియం ఎక్కువగా ఉంటుందనే భావనతో వీటిని తీసుకోవడానికి ముందుకు రారు. అలాంటి వారి కోసం ఇప్పుడు.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందేలా రెండు యాక్సిడెంటల్ పాలసీలు తీసుకొచ్చింది. ఇంతకీ, ఆ పాలసీలు ఏంటి? ఎవరెవరు అర్హులు? ఏ ప్రీమియం తీసుకుంటే ఏయే ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలసీలు ఇవే: ఇండియన్ పేమెంట్స్ బ్యాంకు తీసుకొచ్చిన యాక్సిడెంటల్ పాలసీల్లో ఒకటి.. హెల్త్ ప్లస్ కాగా, మరొకటి.. ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లస్. అందులోనూ 'హెల్త్ ప్లస్ పాలసీ' కింద మరో మూడు రకాల వార్షిక ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. అవి రూ. 355, రూ. 555, రూ. 755లుగా ఉన్నాయి. ఇక హెల్త్ ప్లస్ పాలసీ కింద తపాలా శాఖ అందిస్తున్న ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్స్ని 18 నుంచి 65 ఏళ్లు ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మాత్రమే వీటికి సంబంధించిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. తీసుకునే పాలసీదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో అకౌంట్ కలిగి ఉండాలి. అయితే, రూ. 355, రూ. 555, రూ. 755 అర్హతలు ఒకేవిధంగా ఉన్న ప్రీమియం ఆధారంగా పొందే ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి.
రూ. 355 ప్రీమియంతో పొందే ప్రయోజనాలు :
- పోస్టాఫీస్ అందిస్తున్న ఈ ప్రీమియం తీసుకున్న పాలసీదారుడు సంవత్సరానికి టాక్సులతో కలిపి రూ. 355 చొప్పున చెల్లిస్తే రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.
- ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా అలాంటి పరిస్థితుల్లో 100 శాతం కవరేజీ అంటే రూ.5 లక్షలు అందుకోవచ్చు.
- అలాగే.. పిల్లల్ల వివాహాం కోసం 50 వేల రూపాయలు అందుతాయి. బోన్స్ విరిగిన సమయాల్లో రూ. 25 వేలు కవరేజీ పాలసీదారుడికి లభిస్తుంది.
299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!
రూ. 555 ప్రీమియంతో పొందే ప్రయోజనాలు :
- ఇండియన్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రీమియం తీసుకున్న పాలసీదారుడు ఏడాదికి టాక్సులతో కలిపి రూ. 555 చెల్లిస్తే రూ. 10 లక్షలు బీమా కవరేజీగా పొందుతారు.
- ఇందులోనూ పాలసీదారుడు ఒకవేళ మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా అలాంటి సందర్భాల్లో పూర్తి కవరేజీ లభిస్తుంది. ఇక్కడ పిల్లల చదవుల కోసం రూ. 50 వేలు కవరేజీ లభిస్తుంది.
- అలాగే యాక్సిడెంటల్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ రూ. లక్ష, ఎముకలు విరిగిన సమయాల్లో రూ. 25 వేల వరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
రూ. 755తో ప్రీమియంతో పొందే బెనిఫిట్స్ :
- హెల్త్ ప్లస్ పాలసీ కింద తపాలా శాఖ అందిస్తోన్న మరో ప్రీమియం.. రూ. 755. ఈ ప్రీమియం కింద సంవత్సరానికి పన్నులతో కలిపి 755 రూపాయలు చెల్లిస్తే రూ. 15 లక్షల కవరేజీ లభిస్తుంది.
- పై ప్రీమియంల మాదిరిగానే ఇక్కడ మరణం, శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో పూర్తి కవరేజీ పొందే ఛాన్స్ ఉంటుంది. అలాగే రూ. లక్ష వరకు పిల్లల వివాహాల కోసం కవరేజీ అందుకోవచ్చు.
- అదే విధంగా రూ. 555 ప్రీమియం మాదిరిగా ఇందులోనూ ఇతర బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
- చివరగా.. హెల్తీ ప్లస్ పాలసీ తీసుకునే ముందు పాలసీదారుడు వారికి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్లి.. పూర్తి వివరాలు తెలుసుకొని ఆపై ప్రీమియం తీసుకోవడం బెటర్.
కేంద్ర ప్రభుత్వ సూపర్ ఇన్సూరెన్స్ - నెలకు రూ.36 చెల్లిస్తే రూ.2 లక్షల జీవిత బీమా!