SME IPO Scams : భారతదేశంలో నేడు ఐపీఓలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏస్ ఇన్వెస్టర్ల నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరూ ఐపీఓలకు అప్లై చేస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అది ఎలా అంటే?
బిగ్ స్కామ్
"మీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే ఆలోచన ఉందా? మీ కంపెనీ విలువను అసలు కంటే అధికంగా చూపిస్తాం. అప్పుడు మీరు పబ్లిక్ ఇష్యూకు వెళ్లి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించవచ్చు. కానీ మా సాయంతో మీరు సేకరించిన నిధుల్లో సగమైనా మాకు ఇవ్వాలి" అంటూ కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు - 'చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్‌ఎమ్‌ఈ)'తో ఒప్పందం చేసుకుంటున్నాయి.
ఛార్టర్డ్ అకౌంటెంట్ల సాయంతో
కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు, ఛార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ఆలోచన ఉన్న కంపెనీల ప్రమోటర్ల గురించి వారి ద్వారా తెలుసుకుంటున్నాయి. తరువాత సదరు ప్రమోటర్లను ఆకర్షించి, ఐపీఓ వల్ల కలిగే లాభాలను, అదనపు ప్రయోజనాలను చెప్పి, మోసాలకు ఒప్పిస్తున్నాయి.
మన దేశంలో ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలకు పెరుగుతున్న ఆదరణను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు ఇలాంటి తప్పుడు పద్ధతిని అనుసరిస్తున్నాయని, ఈ పరిణామాలను గమనిస్తున్న వర్గాలు చెబుతున్నాయి. గతంలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ 'అక్రమ వ్యాపార విధానం', ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలకూ విస్తరించిందని సదరు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
స్కామ్ ఎలా చేస్తారంటే?
ఐపీఓకు రావాలనుకునే కంపెనీ ప్రమోటర్లు, బ్యాంకర్ల మధ్య ఒప్పంద ప్రక్రియ ఎలా జరుగుతుందో ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రూ.100 కోట్ల లాభాన్ని ఆర్జించే ఒక కంపెనీ అసలు విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అయితే ఆ కంపెనీ విలువను రూ.1000 కోట్లకు లేదా రూ.2000 కోట్లకు పెంచుతామని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ చెబుతుంది. కానీ ఐపీఓ ద్వారా అదనంగా సమీకరించిన డబ్బులో సగం వాటా తమకు ఇవ్వాలని కండిషన్ పెడుతుంది. ఇది లాభదాయకంగా ఉంటుంది కనుక చాలా చిన్న, మధ్య తరహా సంస్థలు (SME) దీనికి ఒప్పుకుంటున్నాయి. దీనితో కంపెనీల విలువను అధికంగా పెంచి చూపిస్తున్నాయి సదరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు. ఇందుకోసం నకిలీ రశీదులు, పద్దు పుస్తకాలను సృష్టించేందుకు కొందరు చార్టర్డ్ అకౌంటెంట్ల సాయాన్ని అవి తీసుకుంటున్నాయి.
అధిక స్పందన కోసం వక్రమార్గం
కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు - ఐపీఓలకు ఓవర్ సబ్స్క్రిప్షన్ చూపించడం కోసం, ధనవంతులతో ఇన్వెస్ట్ చేయిస్తున్నాయి. అంటే ధనవంతుల చేత ఎక్కువ సంఖ్యల్లో బిడ్లు వేయిస్తున్నాయి. సాధారణ మదుపర్లను ఆకర్షించేందుకు ఈ వ్యూహాన్ని వాడుతున్నాయి.
సాధారణంగా పబ్లిక్ ఇష్యూల నిర్వహణ నిమిత్తం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు 1-3 శాతం వరకు రుసుములు వసూలు చేస్తుంటారు. కానీ ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓల విషయంలో ఈ రుసుము 7 శాతం వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో కొంత మొత్తాన్ని బ్యాంకుల ద్వారా చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. ఇలా నగదు రూపంలో సేకరించిన డబ్బులను, తదుపరి ఇష్యూలో కొందరు మదుపర్లతో బిడ్‌లు వేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు వాడుతున్నట్లు, ఈ పరిణామాలను గమనిస్తున్న వర్గాలు చెబుతున్నాయి.
సెబీ హెచ్చరిక
కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు అనుసరిస్తున్న ఈ అక్రమ పద్ధతులపై ఇప్పటికే మదుపర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ఎస్‌ఎమ్‌ఈ పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఎస్‌ఎమ్‌ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితిని పారదర్శకంగా చూపించేలా కఠిన నిబంధనలు రూపొందించడంపైనా సెబీ దృష్టి పెట్టింది.
6 దేశీయ బ్యాంకులపై దర్యాప్తు!
ఎస్‌ఎమ్‌ఈల పబ్లిక్ ఇష్యూలపై పనిచేసిన 6 దేశీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలపై సెబీ దర్యాప్తు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా ఆయా బ్యాంకులు వసూలు చేసిన రుసుముల వివరాలను సెబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తంలో 15 శాతాన్ని ఇవి రుసుముగా తీసుకున్నట్లు సెబీ గుర్తించిందని రాయిటర్స్ వార్తా కథనం పేర్కొంది. అయితే ఈ దర్యాప్తును ఎదుర్కొంటున్న ఆ బ్యాంకుల పేర్లు తెలియరాలేదని తెలిపింది.
ఇండియాలో రూ.5 కోట్ల నుంచి - 250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీల నమోదుకు ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారు. 2023-24లో 205 చిన్న కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.6,000 కోట్లను సమీకరించాయి. 2022-23లో 125 కంపెనీలు ఏకంగా రూ.2,200 కోట్లను ఐపీఓల సమీకరించడం గమనార్హం.
స్మాల్/ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?