Ambani Family Shiva Shakti Puja : ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం అట్టహాసంగా శుక్రవారం జరగనుంది. అయితే వివాహానికి కొద్ది గంటల ముందు అంబానీ కుటుంబం ముంబయిలోని తమ స్వగృహం ఆంటిలియాలో శివశక్తి పూజ జరిపించింది. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబసభ్యులతోపాటు అతిథులు కూడా విచ్చేశారు.
పూజలో భాగంగా దుర్గాదేవి, శివుడిని విశేషంగా ఆరాధించారు అంబానీ ఫ్యామిలీ మెంబర్స్. అయిగిరి నందిని అంటూ పండితుల స్తోత్రాల మధ్య దుర్గాదేవిని పూజించారు. శివలింగానికి క్షీరాభిషేకం ఇచ్చారు. సామూహిక హారతి ఇచ్చారు. కీర్తనలు పాడుతూ తన్మయత్వంలో మునిగిపోయారు. హోమం కూడా నిర్వహించారు. అనంతరం వేద పండితులు అంబానీ కుటుంబసభ్యులకు రక్షణ కవచాలు అందించి ఆశీర్వదించారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
#WATCH | Mumbai: The Ambani family and guests participated in the Shiva Shakti Puja organized at Antillia, to seek blessings for Anant Ambani and Radhika Merchant pic.twitter.com/j8rQoMlRjV
— ANI (@ANI) July 11, 2024
అతిరథ మహారథులు మధ్య!
Anant Ambani Radhika Merchant Marriage : ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరగనున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకకు అతిరథ మహారథులు రానున్నారు. దేశదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వస్తున్నారు. హాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్ దంపతులు, బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్- అభిషేక్ బచ్చన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.
వీరితోపాటు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామి సులుహు హస్సన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్‌తో మొదలయ్యే ఈ వేడుకలు 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్‌తో ముగుస్తాయి.