Who will be next CM of Delhi : మరో రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో దిల్లీ సీఎం పదవిని కేజ్రీవాల్ ఎవరికి అప్పగిస్తారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? దిల్లీ రాజకీయ సమీకరణాలు ఏంటి? కేజ్రీవాల్ వ్యూహాలు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఎవరికి సీఎం పీఠం!
దిల్లీ సీఎం బాధ్యతలను కేజ్రీవాల్ తన భార్య సునీతకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నుంచి సునీత సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని ఊహాగానాలు వినిపించాయి. దేశంలోని ఇతర రాజకీయ ప్రాంతీయ పార్టీల మాదిరిగానే సీఎం పదవిని కేజ్రీ తన కుటుంబ సభ్యులకే అప్పగిస్తారా? లేదా ఇతరులకు అవకాశం ఇస్తారా? అనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ తాను జైలుకు వెళ్లిన సమయంలో తన భార్య రబ్రీ దేవీకి సీఎం పీఠాన్ని అప్పగించారు. ఝార్ఖండ్‌లో శిబూ సోరెన్ తన కుమారుడు హేమంత్‌కు పగ్గాలు అప్పగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం సైతం తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు. కేజ్రీ కూడా ఇలాగే చేస్తారా? పార్టీలోకి ఇతరులకు సీఎం పగ్గాలు అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ఇతర నేతలవైపే మొగ్గు!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కొవడానికి కేజ్రీవాల్ తన భార్యకు కాకుండా ఇతరులకు సీఎం పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తన భార్య సునీతకు సీఎం పదవి ఇస్తే, ఇతర ప్రాంతీయ పార్టీలలానే ఆప్ కూడా కుటుంబ పార్టీ అని ముద్ర పడుతుంది. కేజ్రీవాల్ బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంది.
రేసులో మంత్రి అతిషి!
దిల్లీ సీఎం రేసులో మంత్రి అతిషి పేరు బలంగా వినిపిస్తోంది. అతిషి సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు నమ్మకమైన నేత. అలాగే మంత్రులు కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ ఖాన్ కూడా సీఎం రేసులో ఉన్నారు. సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా పేర్లు తక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే కొన్నినెలలపాటు దిల్లీకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవసరం. ఈ నేపథ్యంలో దళితుల ఓట్లను రాబట్టుకునేందుకు కేజ్రీవాల్ ఆప్‌లో దళిత నేతలైన కులదీప్ కుమార్, గిరీశ్ సోనీ పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
సీఎం రేసులో మనీశ్ సిసోదియా ఉన్నప్పటికీ, ఆయన ఆ పదవిని అధిష్ఠించరని కేజ్రీవాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తనకు, మనీశ్ సిసోదియాకు ప్రజలు ఓట్లు వేసి నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీపై కూర్చోబోనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిసోదియా కూడా సీఎం రేసులో లేనట్లు తేలిపోయింది. మరో రెండు రోజుల్లో దిల్లీ కొత్త సీఎం ఎవరో తేలిపోనుంది.
'అదొక డ్రామా'
మరోవైపు, కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనను డ్రామాగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్. కేజ్రీవాల్ చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని విమర్శించారు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి, బెయిల్ పొందిన తర్వాత ఏ ఫైల్‌ను ముట్టుకోవద్దని కోర్టు చెప్పడం చరిత్రలో ఇది మొదటిసారి కావచ్చని ఎద్దేవా చేశారు. సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులేవీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల విషయంలో విధించలేదని తెలిపారు. మరోవైపు, ఫైళ్లపై సంతకం చేయలేనప్పుడు కేజ్రీవాల్ సీఎంగా ఉండి ఏం లాభమని బీజేపీ సీనియర్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.
2రోజుల్లో రాజీనామా చేస్తా- అప్పటి వరకు సీఎంగా ఉండను: కేజ్రీవాల్ - Kejriwal Resignation