What is Monsoon: భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం రుతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక రుతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూలకారణం రుతుపవనాలే. మరి.. ఈ రుతుపవనాలు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు? ఎలా ఏర్పడతాయి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రుతుపవనాలు అంటే.. : రుతుపవనాలు ప్రత్యేకమైన వర్షాన్నిచ్చే శక్తి ఉన్న తాత్కాలిక పవనాలు. ఇవి కాలానుగుణంగా ఏర్పడుతాయి. అంటే అవి ఏడాదంతా వీయకుండా కొన్ని రుతువుల్లో, కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. భూ, జలభాగాల మధ్య రుతువును అనుసరించి, దిశను మార్చుకుంటూ వీస్తుంటాయి. రుతుపవనం అనే పదం ‘మౌసం’ అనే అరబిక్ పదం నుంచి తీసుకున్నారు. ‘మౌసం’ అంటే రుతువు అని అర్థం. అరేబియా సముద్రంలో రుతువును అనుసరించి వచ్చిన పవనాలకు క్రీ.శ. 7వ శతాబ్ద నావికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.
ఎన్ని రకాలు: మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు.
నైరుతి రుతుపవనాలు: భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. అదే సమయంలో సముద్రంలోని నీరు కూడా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ కారణంగా గాలిలో తేమ శాతం పెరిగి.. బరువుగా మారుతుంది. దీంతో గాలి వీచే దిశ మారుతుంది. తేమగా ఉన్న ప్రాంతం నుంచి ఉష్ణ ప్రాంతం వైపు ఆ గాలి మల్లుతుంది. అంటే.. సముద్రం నుంచి భూమిపైకి గాలులు వీస్తాయి. తద్వారా తేమతో కూడిన గాలి కాస్తా ఘనీభవించి వర్షంగా కురుస్తుంది. నైరుతి నుంచి భారతదేశం వైపు ఈ గాలులు వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) అంటారు.
ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడంటే ! - SOUTHWEST MONSOON 2024
రుతుపవనాలు దక్షిణాసియా వాతావరణాన్ని ప్రభావితం చేసే అతి పెద్ద అంశం. భారతదేశంలో పంటల ఉత్పత్తి, భూగర్భ జలాల లభ్యత నేరుగా రుతుపవనాలతో ముడిపడి ఉన్నాయి. ఈజీగా చెప్పాలంటే.. వేసవి కాలం తర్వాత దిశను మార్చే పవనాలను రుతుపవనాలు అంటారు. ఈ సమయంలో, ఈ గాలులు తమ దిశను మార్చుకుంటాయి. చల్లని ప్రాంతం నుంచి.. వేడి ప్రాంతాల వైపు వీస్తాయి. అవి చల్లని ప్రాంతాల నుంచి వేడి ప్రాంతాలకు ప్రవహిస్తాయి కాబట్టి.. ఈ గాలులలో తేమ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో కేరళ తీరాన్ని తాకిన వెంటనే వర్షాలు పడడానికి కారణం ఇదే.
తొలి వర్షం ఇక్కడే: రుతుపవనాల కారణంగా మన దేశంలో తొలుత వర్షం పడే ప్రాంతం ఏదో తెలుసా? కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో తొలి వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత 5 నుండి 7 రోజులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటాయి. పది రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంటుంది. 15 రోజుల్లో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో.. 20 - 25 రోజుల్లో మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరిస్తాయి. కేరళ తీరాన్ని తాకిన నెల రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన ఉదయం నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకినట్టు ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఇవాళ, రేపటిలోగా రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో గుడ్‌న్యూస్- అనుకున్న డేట్ కన్నా ముందే వర్షాలు! - South West Monsoon IMD