Confusing Gender Signs on Restrooms: ప్రస్తుతం అంతా మోడ్రన్ మయం. ఏది చూసినా ట్రెండీగా ఉండాల్సిందే. అయితే.. ఈ ట్రెండ్ ఆఖరికి టాయిలెట్లను రిప్రెజెంట్ చేసే విషయంలోకి సైతం చొరబడడంతో ఇదెక్కడి చోద్యం అంటున్నారు జనాలు! ఓవర్ లుక్‌లో డోర్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటని సీరియస్, కామెడీ మిక్స్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
మనం ఏదైనా పని మీద బయటికి వెళ్లినప్పుడు.. ఏదో ఒక సందర్భంలో పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. అవి షాపింగ్ మాల్స్ కావొచ్చు.. మరెక్కడైనా కావొచ్చు. అయితే.. రోజూ వెళ్లే ఆఫీసు వంటి చోట్లలో ఏది జెంట్స్ టాయిలెట్.. ఏది లేడీస్ టాయిలెట్ అనేది మనకు తెలిసి ఉంటుంది. కానీ.. కొత్త ప్రాంతానికి వెళ్తే.. డోర్ పైనున్న సూచనలను ఫాలో అవుతాం. మనం వెళ్లాల్సింది ఇదే అని కన్ఫాం చేసుకున్న తర్వాత డోర్ తెరుస్తాం. కానీ.. ఇప్పుడు ట్రెండీ గోల ఇక్కడికీ చేరడంతో ఇబ్బంది పడడం జనాల వంతవుతోంది!
పాతకాలంలో టాయిలెట్లను ఇంగ్లీషులో.. Ladies Toilets/Gents Toilets అని క్లియర్‌గా రాసి ఉంచేవారు. పక్కనే ఆడ, మగ బొమ్మలు క్లియర్‌గా ఉండేవి. ఆ తర్వాత కాలంలో ట్రెండ్ మారింది.. He/She అని.. లేదంటే His/Her అని సూచించేవారు. ఆ తర్వాత అసలు పేర్లు రాయడం వదిలేసి.. ఆడ, మగ బొమ్మలు మాత్రమే డోర్‌పై అతికించడం మొదలు పెట్టారు. ఈ బొమ్మలను చూసుకునే.. ఇది మనం వెళ్లాల్సిన గమ్యస్థానం అంటూ.. డోర్ తెరుస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ట్రెండ్‌కు మరింత క్రియేటివిటీ అద్దుతున్నారు కొందరు.. ఫలితంగా జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమంటే.. వాష్ రూమ్ డోర్లపై పెట్టే ఫొటోలు.. ఆడవాళ్లవా? మగవాళ్లవా? అని తేడా తెలుసుకోలేకుండా ఉంటున్నాయి. తీక్షణంగా చూస్తే తప్ప.. ఏ బొమ్మ ఎవరిదో అర్థం కాకుండా ఉంటున్నాయి. స్టోన్ కోల్డ్ జేన్ ఆస్టన్(Stone cold jane Austen) అనే X ఖాతాలో ఈ ఫొటోలు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
"ఇదేం క్రియేటివిటీ రా బాబోయ్" అని కొందరు అంటుంటే, "చూసుకోండి బ్రదర్" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు "సూపర్ మాన్ లాంగ్ టై వేసుకున్నాడు" అని కామెంట్ చేస్తుంటే.. "ఈ క్రియేటివిటి పక్కకు పెట్టి ఇంగ్లీష్‌లో బోర్డ్స్ పెట్టండి" అని సలహా ఇస్తున్నారు మరికొందరు. ఈ ఫొటోను ట్యాగ్ చేస్తూ.. ఇలాంటి మరికొన్ని కన్ఫ్యూజన్ ఫొటోలను పోస్టు చేస్తున్నారు జనం. మరి.. ఈ ట్రెండ్ ఎక్కడిదాకా విస్తరించిందో తెలియదుగానీ.. ఎందుకైనా మంచిది పబ్లిక్ టాయిలెట్లలోకి వెళ్తుంటే మాత్రం.. ఒకటికి రెండు సార్లు చూసుకొని తలుపు తీస్తే మంచిది!