Tourist Places In Ayodhya : అయోధ్య అంటే యుద్ధం లేని ప్రదేశం. ఎవరూ గెలవలేని దేవతల నగరం. అందుకే అయోధ్య అంటే ప్రశాంతతకు మారుపేరు. సామరస్యానికి ప్రతీక. శాంతి సద్భావనలకు సమున్నత పతాక. కోసలరాజ్య రాజధానిగా ఎన్నో రాజవంశాల వైభవ, ప్రాభవాన్ని అయోధ్య తిలకించింది. సరయూ నది తీరాన ఉన్న ఈ పురాణపురి అయోధ్య దినదినప్రవర్ధమానమై వేల ఏళ్ల చరిత్రకు ప్రత్యక్ష తార్కాణమై భాసిల్లుతోంది. ఈ అయోధ్య నగరి గురించి ఎన్నో పురాణాలు విశ్లేషించాయి. సూర్యవంశీకుల రాజధానిగా అలరారింది అయోధ్య.
కనక్ మహల్‌ను కానుకగా ఇచ్చిన దశరథుడు!
అయితే అయోధ్యలో భక్తులు దర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. సీతారాముల వివాహం తర్వాత అయోధ్యలో ప్రవేశించాక, కైకేయీ, దశరథులు వారికి కనక్ మహల్‌ను కానుకగా ఇచ్చారని విశ్వసిస్తారు. ఈ భవనాన్ని ఆ తర్వాత విక్రమాదిత్యుడు పునర్నిర్మించాడని ప్రతీతి. పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు తనకు సాయంచేసిన వారందరికీ కానుకలు సమర్పించారు.
ఎత్తైన ప్రదేశంలో హనుమంతుడి ఆలయం
అత్యధికంగా సహకరించి, సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసయోగ్య స్థలాన్ని ఇచ్చాడంటారు. అక్కడే హనుమంతుడికి ఆలయ నిర్మాణం జరిగింది. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయానికి 90 మెట్లు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది.
కౌసల్యదేవికి ప్రత్యేక గుడి
శ్రీరాముడి మాతృమూర్తి కౌసల్యాదేవికి ప్రత్యేకంగా అయోధ్యలో మాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్య, దశరథులతో శ్రీరాముడు కొలువై ఉంటారు. వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ మందిరంలో వాల్మీకితోపాటు లవకుశుల మూర్తులు ఉండటం విశేషం.
అయితే అయోధ్య దివ్యాలయ నిర్మాణానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం గుజరాత్‌కు చెందిన సోమ్‌పురా కుటుంబానికి దక్కింది. తరతరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయ నిర్మాణాలు చేపడుతున్న ఖ్యాతి ఈ కుటుంబం సొంతం. చంద్రకాంత్ సోమ్‌పురా 1989లో మొదటిసారి వీహెచ్‌పీ అభ్యర్థన మేరకు రామాలయం డిజైన్ రూపొందించారు. వివాదాస్పద ప్రాంతంలోకి సాధారణ భక్తుడి వేషంలో చంద్రకాంత్ వెళ్లి తన కాలి అడుగులతో ఆ ప్రాంతం కొలిచారు.
ఆలయాన్ని ఎక్కడ, ఏ విస్తీర్ణంలో నిర్మించాలో అక్కడే ఓ అంచనాకు వచ్చారు. ఇప్పుడు సాకారమైన ఆలయం ఆనాడు ఆయన ఆ క్షేత్రంలో డిజైన్ చేసిందే. 2021లో పాత డిజైన్‌కు కొద్దిపాటి మెరుగులు దిద్ది నగరశైలిలో నూతన నమూనాను రూపొందించారు. ఆ డిజైన్‌తోనే ప్రస్తుత రామాలయ నిర్మాణం పూర్తయింది. చంద్రకాంత్ సోమ్‌పురా వృద్ధాప్యం కారణంగా ఆయన కుమారులు ఆశిష్, నిఖిల్ మందిర నిర్మాణ బాధ్యతల్ని పూర్తి చేశారు.
1951లో నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని డిజైన్ చేసింది కూడా సోమ్‌పురా కుటుంబమే కావడం విశేషం. రామమందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, స్తంభాలు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీలు వినియోగించకుండా ఇంతటి మహత్తర నిర్మాణం సాకారం కావడం అపూర్వం - అద్భుతం. 2500 సంవత్సరాలైనా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఆచంద్రతారార్కం భాసిల్లేరీతిలో ఆలయ నిర్మాణం సాక్షాత్కారమైంది.