Tirumala Special Darshan Tickets For April 2024 : తిరుమలలోని ఏడుకొండలపై కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి దర్శనానికి భక్తులు ఏ స్థాయిలో బారులు తీరుతారో తెలిసిందే. అయితే.. ఆయన దర్శనభాగ్యం మాత్రమే కాకుండా శ్రీనివాసుడికి సేవ చేసుకునే భాగ్యం కూడా కల్పిస్తోంది టీటీడీ (TTD). ఇందులో భాగంగా మూడు నెలల ముందుగానే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పలు ఆర్జిత సేవల టికెట్లు ఈ రోజు విడుదల చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఏప్రిల్ నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం.. జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇవాళ (జనవరి 22) కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవాటికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. జనవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ఈ టికెట్లు విడుదల చేయనుంది. అదేవిధంగా.. వర్చువల్ సేవా టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
వసంతోత్సవ టికెట్లు కూడా...
తిరుమలలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను కూడా ఈ రోజే విడుదల చేయనున్నారు. ఉదయం 10గంటలకు అధికారులు ఈ టికెట్లు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మాత్రం 23వ తేదీన ఉదయం 10గంటలకు రిలీజే చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, గదుల కోటాను సైతం 23వ తేదీనే ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను కూడా.. 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
ప్రత్యేక దర్శన టికెట్లు..
ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు (రూ.300 టికెట్లు)ను జనవరి 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ సైతం ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను మాత్రం జనవరి 27వ తేదీన ఉదయం 11గంటలకు విడుదల చేస్తారు. నవనీత సేవ కోటాను అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
ముందే బుక్ చేసుకోండి..
ఏప్రిల్లో మీరు తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టియితే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ అంటే.. ఎండలు మండిపోతాయి. చిన్నారులు, వృద్ధులు ఉన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెలవు దినాల్లో భక్తులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకొని https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా స్వామివారి ఆర్జిత సేవలు, ఇంకా దర్శన టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.