Telangana Tourism Ananthagiri Hills Tour: ఈ సమ్మర్ హాలిడేస్‌లో చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కు వెళ్లాలనుకుంటారు. తమ బడ్జెట్‌కు తగినట్టు టూర్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, పర్యాటకుల అభిరుచికి తగినట్టుగానే తెలంగాణ టూరిజం కూడా వివిధ రకాల టూర్ ప్యాకేజీలను ప్రవేశ పెట్టింది. ఈ ప్యాకేజీల వల్ల ఎంతో మంది పర్యాటకులు కొత్తకొత్త ప్రదేశాలను చూస్తున్నారు. తాజాగా.. తెలంగాణ అరకులోయగా పిలిచే అనంతగిరి కొండలను.. ఒక్క రోజులో చూసి వచ్చేలా ఒక కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుంది ? ఒక్కరికి టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారు ? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఇక్కడి పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూస్తే ప్రతి ఒక్కరు మైమరిచిపోవాల్సిందే. అంత బాగుంటుంది.. ఈ ప్రాంతం. అందుకే సెలవులు, వీకెండ్ రోజుల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాగా, తెలంగాణ టూరిజం "హైదరాబాద్ నుంచి అనంతగిరి (వికారాబాద్) & బ్యాక్ వన్ డే టూర్ ప్యాకేజీ" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ ట్రిప్‌కు వెళ్తే చాలు ఒక్క రోజులో అనంతగిరి హిల్స్ చూడొచ్చు.
టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుంది :
- ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకున్న వారు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ వద్ద బస్సు ఎక్కాలి. ఉదయం 9 గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది.
- మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు మొదట అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం ఉంటుంది.
- అడవిలోకి వెళ్లి చూడాలనుకునే వారు మధ్యాహ్నం 12.30 నుంచి 01.30 గంటల వరకు చూడొచ్చు.
- మధ్యాహ్నం 01.30 నుంచి 02.30 వరకు హరిత హోటల్‌లో భోజనం(వెజ్) ఉంటుంది.
- 02.30 నుంచి 04.30 వరకు గేమ్స్ ఆడుకోవచ్చు.
- 04.30 నుంచి 5 గంటల మధ్యలో హరిత హోటల్‌లో టీ, స్నాక్స్ అందిస్తారు.
- తర్వాత సాయంత్రం 5 గంటలకు అనంతగిరి నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరుతుంది.
- రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది.
టికెట్ ధరలు :
- అనంతగిరి టూర్‌కు వెళ్లాలనుకునే పెద్దలకు ఒక్కరికి తెలంగాణ టూరిజం రూ.1800లను ఛార్జ్ చేస్తుంది. అలాగే పిల్లలకు రూ.1440లను టికెట్ ధరగా నిర్ణయించింది.
- టూర్ ప్యాకేజీ లేదా మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సంప్రదించండి.