Tamilisai Amit Shah Viral Video : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సంభాషణ పట్ల వస్తున్న వార్తలపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార వేడుకలో అమిత్ షాతో చర్చకు సంబంధించి వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఆ విషయాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
ఎంతో భరోసా కలిగించాయి!
"లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది" అని తమిళిసై తెలిపారు.
అయితే బుధవారం జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తమిళిసై వేదికపై కూర్చున్న నేతలను పలకరిస్తూ ముందుకువెళ్లారు. అక్కడే ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్ షాను కూడా ఆమె పలకరించారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు కనిపించింది. ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
ఇంత సీరియస్ చర్చేంటి?!
ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్ చర్చేంటి? అనే కోణంలో నెటిజన్ల మధ్య చర్చ జరిగింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, తమిళిసై మధ్య విబేధాలు తలెత్తాయని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాష్ట్ర నాయకత్వంపై ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిపై తమిళిసై తాజాగా స్పందించి వార్తలకు చెక్ పెట్టారు.
'ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా' - గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తమిళిసై వైపే అందరి చూపు- దక్షిణ చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ గెలుస్తారా?