Swati Maliwal Case : ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. వారితో పాటు ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఉన్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఉన్న డ్రాయింగ్ రూమ్‌ను పోలీసులు పూర్తి మ్యాపింగ్ చేస్తున్నారని, ఘటనపై ఆరా తీస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో స్వాతి మాలీవాల్ కూడా అక్కడే ఉన్నారు. దాడి ఘటనకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ కుట్ర పన్నింది: ఆతిశీ
మరోవైపు, ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై జరిగిన దాడి కేసు నేపథ్యంలో ఆ పార్టీ సంచలనలు ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఇరికేంచేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించింది. స్వాతీ మాలీవాల్‌పై దాడి ఘటన నిరాధారమైందని దిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎం నివాసానికి స్వాతి మాలీవాల్ వచ్చారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయడమే ఆమె ఉద్దేశమని ఆరోపించారు.
కేజ్రీవాల్‌ను కలవాలని స్వాతి పట్టుబట్టగా, ఆయన బిజీగా ఉన్నారని బిభవ్ కుమార్ చెప్పారన్నారు ఆతిశీ. ఆమె అరుస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని ఆతిశీ వివరించారు. తనను దారుణంగా కొట్టారని స్వాతి ఆరోపించారని, అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. బిభవ్ కుమార్‌పై స్వాతి బెదిరింపులకు దిగినట్లు కనబడుతోందని, దాన్ని బట్టి ఆమె ఆరోపణలు నిరాధారమైనవని తెలుస్తోందని అన్నారు. కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు స్వాతిని పావుగా బీజేపీ మార్చుకుందని ఆరోపించారు. స్వాతీ మాలీవాల్‌పై బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆప్ యూటర్న్: స్వాతి
తనపై దాడి జరిగిన విషయాన్ని అంగీకరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుందని స్వాతీ మాలీవాల్ తెలిపారు. గూండాల ఒత్తిడికి లొంగిపోయిందని ఆరోపించారు. "ఆ గూండా 'నన్ను అరెస్టు చేస్తే అన్ని రహస్యాలు బయటపెడతాను' అని పార్టీని బెదిరిస్తున్నాడు. అందుకే అతడి ఒత్తిడికి తలొగ్గి నాపై విమర్శలు చేస్తున్నారు. మహిళల కోసం ఒంటరిగా పోరాడుతున్నాను. నా కోసం కూడా పోరాడతాను. సమయం వచ్చినప్పుడు నిజం బయటకు వస్తుంది" అని స్వాతి ట్వీట్ చేశారు.
'నిస్సహాయ స్థితిలో ఆప్'
మరోవైపు, స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసులో ఉచ్చు బిగుసుకుపోవడం వల్ల ఆప్ తీవ్ర భయాందోళనలకు గురై నిస్సహాయ స్థితిలో ఉందని దిల్లీ బీజేపీ ఆరోపించింది. "మొత్తం ఘటనపై కేజ్రీవాల్ మౌనం వహించడం ఆప్ ఒక గూండాను కాపాడుతోందని సూచిస్తుంది. బిభవ్ కుమార్‌పై ఉచ్చు బిగుస్తోంది కేజ్రీవాల్ కూడా అనుమానానికి గురవుతున్నారు" అని బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. ఈ విషయంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.