Supreme Court On OTT Regulation : భారత్‌లో ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను పర్యవేక్షించడానికి/నియంత్రించడానికి స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అది విధానపరమైన అంశం అన్న కోర్టు, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నీ విధాన రమైన అంశాలపై దాఖలవుతున్నాయని, ఇప్పుడు ఇదో సమస్య అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫలితంగా నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కోల్పోతున్నామని వ్యాఖ్యానించింది.
ఓటీటీ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను నియంత్రించడానికి ఓ స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలని లాయర్ శశాంక్ శేఖర్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం సినిమాల బహిరంగ ప్రదర్శనను నియంత్రించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-సీబీఎఫ్సీ సంస్థ ఉందని పిటిషన్లో లాయర్ పేర్కొన్నారు. కానీ, ఓటీటీల్లో కంటెంట్‌ను పర్యవేక్షించడానికి అలాంటి సంస్థ ఏదీ లేదని తెలిపారు. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు స్వీయ నిబంధనలకు మాత్రమే కట్టుబడి ఉంటాయని, కానీ వాటిని పూర్తిగా పాటించవని ఆరోపించారు. ఎలాంటి తనిఖీలు లేకుండా వివాదాస్పద కంటెంట్‌ను ప్రదర్శిస్తాయని పిటిషనర్ చెప్పారు. అంతేకాకుండా దేశంలో 40కి పైగా ఓటీటీ, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లింపు, ప్రకటనలతో కూడిన, ఉచిత ప్రాతిపదికన కంటెంట్‌ను పౌరులకు అందిస్తున్నాయని, ఆర్టికల్ 19 ద్వారా లభించిన భావ వ్యక్తీకరణ హక్కును దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
ఇషా ఫౌండేషన్‌కు సుప్రీం భారీ ఊరట
Supreme Court On Isha Foundation Case : సుప్రీంకోర్టులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌కు భారీ ఊరట లభించింది. తమ ఇద్దరు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి ఇషా ఫౌండేషన్‌లో బ్రహ్మచర్యం ఇచ్చారని, వారిని కలవకుండా అడ్డుకున్నారని ఓ తండ్రి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జరుగుతున్న విచారణను తాజాగా సుప్రీం కోర్టు రద్దు చేసింది.
ఇటీవల వందల మంది తమిళనాడు పోలీసులు కోయంబతూర్‌లోని ఆశ్రమంలో తనిఖీలు చేయడానికి వ్యతిరేకంగా ఇషా ఫౌండేషన్ సుప్రీంను ఆశ్రయించింది. ఆశ్రమంలో చేరినప్పుడు గీతా, లత వయసు 27, 24 ఏళ్లనీ, పూర్తి ఇష్ట ప్రకారమే చేరారని తెలిపింది. హైకోర్టులో హాజరుపరిచినా అదే చెప్పారని పేర్కొంది. ప్రస్తుతం వారి వయసు 42, 39 ఏళ్లుగా తెలిపింది. మహిళల్లో ఒకరు సుప్రీం విచారణకు హాజరై ఆ విషయాన్ని ధ్రువీకరించడమే కాక తల్లిదండ్రులే తమను వేధించారని చెప్పడం గమనార్హం. వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆశ్రమంలో చేరినపుడు మేజర్‌లు కావడం వల్ల చట్ట విరుద్ధంగా నిర్బంధించారన్న తండ్రి వాదన చెల్లదని స్పష్టం చేసింది. వారు హైకోర్టు ఎదుట హాజరవడం వల్ల హేబియస్ కార్పస్ ఉద్దేశం పూర్తయిందని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆ ఒక్క కేసుకు మాత్రమేనని తెలిపింది. కాగా ఇప్పటికే ఇషా ఫౌండేషన్‌పై పలు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.