Sudha Murthy Rajya Sabha Nominated : విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవిగా ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని తెలిపారు. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేయడం దేశంలో మహిళల శక్తి, సామర్థ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని అన్నారు. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ఆకాంక్షించారు.
'పేదలకు సేవ చేసేందుకు పెద్ద అవకాశం'
మరోవైపు, రాజ్యసభకు నామినేట్ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మరింత బాధ్యత పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు. పేదలకు సేవ చేయడానికి పెద్ద అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. నన్ను నేను రాజకీయ నాయకురాలిగా భావించడం లేదు. నా అల్లుడు తన దేశం కోసం చేస్తున్న రాజకీయాలు వేరు. నా పని వేరు" అని తెలిపారు.
డబుల్ సర్‌ప్రైజ్!
మరోవైపు, ప్రస్తుతం థాయ్‌లాండ్ పర్యటనలో సుధామూర్తి మీడియా సంస్థలతో ఫోన్లో మాట్లాడారు. "మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్ సర్‌ప్రైజ్. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని నమ్ముతున్నా" అని ఆమె పేర్కొన్నారు
73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం 'మూర్తి ట్రస్ట్'కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, మానవత్వవాదిగా సుధామూర్తి దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి
'నా కూతురే రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిని చేసింది.. ప్రతి గురువారం ఆయన..'