Stampede In Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. హథ్రస్ జిల్లాలో జరిగిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. రతిభాన్‌పుర్‌లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరిగి 60మంది ప్రాణాలు కోల్పోయినట్లు మొదట సమాచారం అందింది. అయితే ఈ ఘటనలో దాదాపు 116మంది మృతిచెందినట్లు అలీగఢ్ రేంజ్ ఐజీ శలాభ్ మథుర్ ధ్రువీకరించారు. అనేక మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఎటా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
VIDEO | Hathras Stampede: " deaths of 116 people have been confirmed. out of them, 27 bodies are in etah mortuary and rest are in hathras. those who have been injured are getting medical treatment and bodies have been sent to different places for post mortem. an fir is also… pic.twitter.com/hgeFHH2uhI
— Press Trust of India (@PTI_News) July 2, 2024
ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్, సత్సంగ్ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
72 మృతదేహాలను గుర్తించాం : యూపీ సీఎస్
"ఇది దురదృష్టకరమైన, హృదయ విదారక ఘటన. ఈ ఘటనకు సంబంధించి మొత్తం పరిస్థితిని సీఎం(యోగి ఆదిత్యనాథ్) పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడం, పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం మా ప్రాధాన్యత. మృతుల సంఖ్య 116కి చేరింది. అందులో ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు 72 మృతదేహాలను గుర్తించాం" అని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు.
VIDEO | Hathras stampede: " this was an unfortunate and a heart-wrenching incident. the cm is monitoring the entire situation. our priority is to provide immediate assistance to the injured and send the dead bodies to their family members after conducting the post-mortem. the… pic.twitter.com/wiLsViHOCg
— Press Trust of India (@PTI_News) July 2, 2024
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
యూపీ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'తొక్కిసలాటలో భక్తుల మరణవార్త హృదయవిదారకంగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.' అని రాష్ట్రపతి అన్నారు. 'హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా' అని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు విచారం వ్యక్తం చేశారు.
రంగంలోకి సీఎం
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయక చర్యలను సీఎం యోగి స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హథ్రస్కు వెళ్లారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలి వద్దకు వెళ్లనున్నారు.
హత్రాస్ తొక్కిసలాటలో మృతుల పట్ల ఎస్పీ, బీఎస్పీ అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 చొప్పున పరిహారం అందించాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.