Karnataka Yoga Teacher Kidnapped Case : కర్ణాటకలో కిడ్నాపర్ల చెర నుంచి ఓ యోగా టీచర్ చాకచక్యంగా బయటపడ్డారు. బాధితురాలి గొంతుకు ఛార్జర్ వైరు బిగించి చంపేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించారు. దీంతో యోగా టీచర్ మరణించినట్లు నటించారు. ఆ తర్వాత బాధితురాలు చనిపోయిందనుకుని కిడ్నాపర్లు ఓ గొయ్యిలో ఆమెను పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని!
భర్త నుంచి విడిపోయిన యోగా టీచర్ బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా నివసిస్తున్నారు. అయితే బిందు అనే మహిళకు తన భర్త సంతోశ్ కుమార్‌తో యోగా టీచర్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించింది. దీంతో యోగా టీచర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్లాన్ చేసింది. అందుకు డిటెక్టివ్ ఏజెన్సీ యజమాని సతీశ్ రెడ్డికి సుపారీ ఇచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
అక్టోబర్ 23న సతీశ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు యోగా టీచర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె తలపై పిస్టల్ పెట్టి బెదిరించి బలవంతంగా కారు ఎక్కించారు. ఆ సమయంలో బాధితురాలిపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం కారులోని ఛార్జర్ వైర్‌ను యోగా టీచర్ మెడకు గట్టిగా బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు మరణించినట్లు నాలుక బయటకు తీసి నటించారు. వెంటనే యోగా టీచర్ చనిపోయిందనుకుని ధనమిత్తెనహళ్లి ప్రాంతంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే చిన్న గొయ్యిలో ఆమెను పాతి పెట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు
కిడ్నాపర్లు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత యోగా టీచర్ గొయ్యిలోని మెల్లగా బయటకు వచ్చారు. అనంతరం ధనమిట్టె గ్రామస్థులకు తనపై జరిగిన దారుణాన్ని చెప్పారు. ఆపై దిబ్బురహళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిటెక్టివ్ ఏజెన్సీ యజమాని సతీశ్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి, రమణా రెడ్డి, రవిచంద్ర, బిందు సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చిక్కబళ్లాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కుశాల్ చౌక్సే తెలిపారు.