Senior Journalists Homage To Ramoji Rao : రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు బెంగళూరులో నివాళులు అర్పించారు సీనియర్ జర్నలిస్టులు. ఈటీవీ కన్నడలో పనిచేసిన వారంతా రామోజీ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో జరిగిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం రామోజీతో గడిపిన క్షణాలు, ఆయన సాధించిన విజయాలు, వృత్తి నైపుణ్యానికి ఇచ్చిన ప్రోత్సాహకాలను గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉన్నా!
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు నరేంద్ర పుప్పాల మాట్లాడారు. దశాబ్ద కాలంగా రామోజీరావుతో కలిసి పని చేయడం తనకు ఎంతో ఆనందదాయకమమని చెప్పారు. ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉన్నా వార్తలను, సంపాదకీయాన్ని, మీడియా సంస్థను విస్మరించలేదన్నారు. రామోజీరావు నిర్మించిన బాటలో తామంతా ప్రయాణించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఈటీవీలో వార్త వస్తేనే!
సామాజిక విలువలకు రామోజీరావు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని సీనియర్ జర్నలిస్ట్ శివశంకర్ తెలిపారు. వాడే భాషలోనూ స్పష్టత ఉండేదని, ఈటీవీలో వార్త వస్తేనే నిజమనే భావన సమాజంలో నెలకొనేలా చేశారన్నారు. అందుకోసం కొన్ని ప్రకటనల్ని సైతం తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు. సామాజిక బాధ్యతను ఏనాడూ ఆయన విస్మరించలేదని చెప్పారు.
ఓ దేవుడిలా తమ అదృష్టానికి!
సీనియర్ న్యూస్ యాంకర్ రాధికా రాణి కూడా మాట్లాడారు. రామోజీరావు ఓ దేవుడిలా తమ అదృష్టానికి తలుపులు తెరిచారనని తెలిపారు. ఫిల్మ్ సిటీలో తాము ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఇదంతా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామాగా నిలిచారు అని సీనియర్ జర్నలిస్టు సమీవుల్లా అన్నారు.
రామోజీరావు మళ్లీ పుట్టాలి!
రామోజీరావుకు మీడియాలో విలువలతో పాటు కన్నడపైన కూడా ఎంతో శ్రద్ధ ఉండేదని, మీడియా సంస్థ మొత్తం నాణ్యతలో మొదటి స్థాయిలో ఉండేలా చూసుకున్నారంటూ ఈటీవీ భారత్ బెంగళూరు బ్యూరో చీఫ్ సోమశేఖర్ కవచూర్ కొనియాడారు. ఆయన తన ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించారన్నారు. ఈటీవీ భారత్ సైతం విజయపథంలో దూసుకుపోతుందని చెప్పారు. రామోజీరావు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు.
నిజంగా అన్నదాత!
రామోజీరావు తమ నిజంగా అన్నదాత వంటి వారని సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ ఉపాధ్యాయ తెలిపారు. రైతుల కోసం అన్నదాత లాంటి కార్యక్రమం చేసిన మొదటి వ్యక్తి ఆయననే గుర్తు చేసుకున్నారు. రామోజీ రావు ప్రతి మూడు నెలలకోసారి మీటింగ్ పెట్టి అన్నీ వెరిఫై చేసేవారని తెలిపారు. ఆయన టీమ్‌లో పనిచేసినందుకు గర్వపడుతున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ బైదనమనేని, సీనియర్ పాత్రికేయులు బీవీ శివశంకర్, నాగరాజు ఎస్‌కే, సదాశివ షెనాయి, ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్, ఈటీవీ మాజీ సహచరులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటీవీ, ఈనాడు సంస్థల్లో పనిచేసిన వారితో పాటు రామోజీరావు గారితో అనుబంధం ఉన్నవారంతా ఈ కార్యక్రమానికి రావాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేయగా పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.