SC Verdict On NEET UG 2024 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు జరగలేదు కనుక పరీక్షను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. లీకేజ్ వ్యవహారం రెండు ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) లోపాలను ధర్మాసం ఎత్తిచూపింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది.
'నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదు. పరీక్ష పవిత్రతకు భంగం కలిగేలా విస్తృత స్థాయిలో లీక్ జరగలేదు. ప్రశ్నపత్రం లీకేజీ కేవలం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నాకే పరిమితమైంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే మేము ఈ పరీక్షను రద్దు చేయం. అయితే, ఎన్టీఏలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఇలాంటివి జరగడం సరికాదు. ఈ ఏడాదేలోనే సమ్యను పరిష్కరించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఏదే అవుతుంది' అని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
'రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలి'
సుప్రీం కోర్ట్ 'నీట్ తీర్పు' సందర్భంగా - ఎన్టీఏ పనితీరు, పరీక్షల సంస్కరణల కోసం, ఇస్రో మాజీ ఛైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో నియమించిన కమిటీకి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలోని లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబరు 30లోగా నివేదికను అందజేయాలని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ నివేదిక అందిన తర్వాత, అందులోని అంశాలను అమలుచేసే విధానంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది.
ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్ ప్రవేశపరీక్ష దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది విద్యార్ధులకు మొదటి ర్యాంకులు వచ్చాయి. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడం వల్ల పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో పేపర్ లీకేజీ, ఇతర అక్రమాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది.
'నీట్లో ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి?'- ముగ్గురు నిపుణుల కమిటీకి సుప్రీం టాస్క్ - NEET UG Paper Leak
నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్‌మైండ్స్ అరెస్ట్- నిందితులిద్దరు MBBS విద్యార్థులే - NEET UG Paper Leak