Complaint On Lawyer In Consumer Court : సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాల (కన్జ్యూమర్ కోర్టు)ల్లో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాయర్లు ఫీజు తీసుకుని కేసులు వాదిస్తుంటారని, దాన్ని వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద 'సేవ'గా పరిగణించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ఆ తీర్పు చెల్లదు!
న్యాయవాదులపై కన్జ్యూమర్ కోర్టులలో దావాలు వేయొచ్చంటూ 2007 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని సెక్షన్ 2 (ఓ) పరిధిలోకి వస్తాయని అప్పట్లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పేర్కొంది. వ్యాపారం, వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేస్తూ వ్యాఖ్యలు చేసింది.
"ఈ తీర్పు వ్యాపారం, వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేసింది. ఒక ప్రొఫెషనల్‌కు ఉన్నత స్థాయి విద్య, నైపుణ్యం, మానసిక శ్రమ అవసరం. వృత్తి నిపుణుడి విజయం వారి నియంత్రణలో లేని వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, వ్యాపారవేత్తలతో సమానంగా ప్రొఫెషనల్‌ను చూడలేమని స్పష్టం చేసింది. "వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, వైద్యులను బాధ్యులను చేయొచ్చని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వీపీ శాంతన కేసులో తీర్పు వచ్చింది. దాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ త్రివేది తెలిపారు.
చిన్న చిన్న గొడవలకు విడాకులు వద్దు : సుప్రీంకోర్టు
కొద్ది రోజుల క్రితం వైవాహిక బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో, స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. ఓ మహిళ తన భర్తపై నమోదు చేసిన వరకట్న వేధింపుల కేసును అత్యున్నత ధర్మాసనం కొట్టివేస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలను చాలా సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు, బంధువులు సున్నితంగా పరిష్కరించకపోవడమే కాకుండా ఇంకా పెద్దది చేస్తుంటారని వ్యాఖ్యానించింది.
'మరణించిన అమ్మాయికి తగిన వరుడు కావాలి- ఆసక్తి ఉన్న వాళ్లు సంప్రదించండి!' - Marriage Of Ghosts